పెద్ద పెద్ద ఇనుప బోనులు... చుట్టూ పోలీసులు కాపలా, లోపల వేల మంది శరణార్థులు. ఆకలితో ఉన్న వారంతా ఆర్తనాదాలు చేస్తుంటే వారికి కుక్కలకు వేసినట్లు ఆహారం వేస్తూ కనిపించిన హృదయ విదారకరమైన దృశ్యం. అతిథి దేవో భవ అన్నదానికి అర్థం లేనట్లు వ్యవహారించే వారి తీరు. ఆహారం కోసం వారంతా కొట్టుకోవడం. ఏదో హాలీవుడ్ సినిమాల్లోనిది కాదిదీ... హంగేరిలో ప్రభుత్వం శరణార్థుల పట్ల వ్యవహారిస్తున్న తీరుకి నిదర్శనం.
ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని శరణార్థులుగా వలస వచ్చిన వేలాది మందికి హంగేరి ప్రభుత్వం ఇలాంటి ట్రీట్ మెంట్ ఇస్తుంది. బయటి ప్రపంచానికి తెలీని ఈ దారుణాన్ని ఓ ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ సీక్రెట్ గా జరిపిన ఆపరేషన్ లో బయటపడింది.
ఓపెద్ద హాల్ చుట్టూ ఫెన్సింగ్, మధ్య హెల్మెట్లు ధరించిన హంగేరీ పోలీసులు వీరికి ఆహరాన్ని అందిస్తున్న వీడియోను ఆ జర్నలిస్ట్ ప్రాణాలకు తెగించి రహస్యంగా చిత్రీకరించాడు. మహిళలు, చిన్నారులు చేతులు చాచి ఆహారం కోసం అర్థిస్తుంటే... ఏదో జంతువులకు వేసినట్లు ఆహారాన్ని విసేరస్తు కనిపించిన ఆ దృశ్యాలను చూసినవారంతా కంటతడి పెడుతున్నారు. ఆహరం అందిస్తున్న అధికారుల దృష్టిలో పడేందుకు వారు అరిచే అరుపులు, చిన్నారుల కేకలతో దారుణంగా ఆ వీడియో ఉంది. ఇది మానవత్వం ఏమాత్రం అనిపించుకోదని, వారికి ఒక్క పూట తిండి కూడా దొరకట్లేదని వీడియో చిత్రీకరించిన జర్నలిస్ట్ క్లౌస్ కుఫ్నర్ అంటున్నాడు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుంది. అదే రేంజ్ లో హంగేరీ ప్రభుత్వంపై తూ అంటూ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.