నటి వీణామాలిక్, ఆమె భర్త బషీర్ ఖాన్ కు 26 ఏళ్ల జైలు శిక్షను విధిస్తున్నట్లు పాకిస్థాన్ లోని ఉగ్ర కార్యకలపాల వ్యతిరేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. పాకిస్థాన్ తో పాటు పలు భారతీయ చిత్రాలలో నటించిన ఈ శృంగార తార ఈ ఏడాది మొదట్లో దుబాయికి చెందిన పారిశ్రామిక వేత్త అసద్ బషీద్‌ను వివాహం చేసుకుంది. గత మే నెలలో జియో టీవి ఛానెల్ లో ప్రసారం అయ్యే ఓ కార్యక్రమానికి వీరు ప్రత్యేక అతిధులుగా వెళ్లారు. ఈ కార్యక్రంలో భాగంగా బ్యాక్ గ్రౌండ్ లో ఓ పాటను ప్లే చేయగా దానికి వీణామాలిక్, ఆమె భర్త అసద్ బషీద్‌లు డాన్స్ చేసారు. అయితే ఆ పాట తమ మతానికి చెందిన పవిత్రమైన పాట. ఈ కార్యక్రమం ద్వారా తమ దైవాన్ని అవమానించారని పలువురు ఫిర్యాదు చేయటంతో వీణా, ఆమె భర్తపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఈ ఉదంతంపై వారు క్షమాపణ చేప్పినప్పటికీ న్యాయస్థానం పట్టించుకోలేదు. ఒక మతాన్ని కించపరుస్తూ, దైవ దూషణతో కూడిన కార్యక్రమాన్ని ప్రసారం చేయడం తీవ్రమైన నేరమని యాంటీ టెర్రరిజం కోర్టు అభిప్రాపడింది. ఈ దంపతులతోపాటు కార్యక్రమానికి యాంకరింగ్ చేసిన షయిస్థా వాహిది, మీడియా టైకూన్ జియో టీవీ అధిపతి మీర్ షకీల్-ఉర్-రెహ్మాన్ లకు కూడా కోర్టు 26 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ.13 లక్షల జరిమానా విధిస్తున్నట్టు న్యాయమూర్తి షాబ్జా ఖాన్ తన తీర్పులో పేర్కొన్నారు. వీరిని వెంటనే అరెస్ట్ చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.