ఆధునిక ప్రపంచంలో రోబోలను అడ్డమైన పనులకే కాదు సాంప్రదాయ వేడుకల్లో కూడా భాగస్వాములను చేస్తున్నారు. సాధారణంగా పెళ్లిలో బంధు మిత్రుల హడావుడి, ఉరుకులు పరుగులు ఉండి సందడిగా ఉంటుంది. కానీ, తాజాగా చైనాలోని షెన్ యాంగ్ లో ఓ ఐదు జంటలు తమ వివాహాన్ని వినూత్నంగా నిర్వహించుకోవాలని భావించాయి. ఏకంగా రోబోలను నిర్మించే కర్మాగారంను తమ వివాహ వేదికగా ఎంచుకున్నారు. దీంతో ఈ ఐదు జంటల వివాహ వేడుకలకు రోబో కర్మాగారం సిద్ధం కాగా, రోబోలే పెళ్లి పెద్దలుగా మారాయి.
వివాహం కోసం వచ్చిన వధూవరులకు ఓ రోబో స్వాగతం పలుకగా, మరో రోబో వారికి అవసరమైన పనులు చేసేందుకు సిద్ధమైంది. వివాహ వేడుకలకు హాజరైన బంధుజనానికి ఏర్పాట్లు చేసింది మరో రోబో. కూల్ డ్రింక్స్, ఫుడ్ ఐటెమ్స్ సప్లయ్ చేస్తూ మరో రోబో సందడి చేసింది. చకా చకా పనులు చేయటమే కాదు వివిధ ఆకారాల్లోని మరికొన్ని రోబోలు ఈ వివాహంలో అతిథులుగా కూడా పాల్గొన్నాయి. ఫ్యాక్టరీ సిబ్బంది, రోబోల మధ్య ఐదు జంటలు తమ వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాయి. ఇదంతా చూశాక పెళ్లంటే ఇదేరా అనిపిస్తుంది కదూ.