కాస్త ఖరీదైనప్పటికీ ఫ్లైట్ లో జర్నీ అంటే ఎంత వేగమూ, సౌకర్యవంతమో అందరికీ తెలిసిందే. కానీ, పొరపాటున అదే ప్రమాదం జరిగితే మాత్రం ఊహించుకునేందుకే ఒళ్లు గగుర్పొడుస్తుంది. టేకాఫ్ టైంలో ‘విమానం బయలుదేరితే మనమంతా మరణిస్తాం’ అన్న అనౌన్స్ మెంట్ వినిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. ప్రయాణికుల సగం ప్రాణాలు అక్కడే గాల్లో కలిసిపోతాయి కదా. సరిగ్గా అలాంటి ఘటనే గ్లాస్గో ఎయిర్ పోర్ట్ లో చోటుచేసుకుంది.
గ్లాస్గో నుంచి డబ్లిన్ బయలుదేరాల్సిన ర్యాన్ ఎయిర్ బడ్జెట్ విమానం అది. అప్పటికే ప్రయాణ సమయానికి ఎనిమిది గంటలు ఆలస్యం అయింది. ప్రయాణికులంతా అసహనంతో చూస్తున్న వేళ మైకు ద్వారా కొన్ని మాటలు వినిపించాయి. "విమానం రెక్కలపై మంచు పేరుకున్న కారణంగా టేకాఫ్ తీసుకునేందుకు కెప్టెన్ నిరాకరిస్తున్నారు. మనమంతా మరణించాలని అనుకోవడం లేదు కదా?" అని ఓ స్టీవార్డెస్ వ్యాఖ్యానించింది.
అంతే విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రయాణికులంతా హాహాకారాలతో చెల్లాచెదురై పోయారు. ఇక అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ ఔత్సాహికుడు ఈ దృశ్యాన్ని వీడియో తీశాడు. అంతటితో ఆనందించకుండా ఫేస్ బుక్ లో కూడా అప్ లోడ్ చేశాడు. సదరు మహిళతో మాట్లాడామని, ఈ తరహా వ్యాఖ్యలు ఆమె నోటి నుంచి వచ్చినందుకు క్షమాపణలు చెబుతున్నామని ర్యాన్ ఎయిర్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది.