కుక్కేంటీ ఎంబీఏ చదవడమేంటనేగా మీ అనుమానం. అడ్మిషన్ అప్పుడు, క్లాసులకు హాజరైనప్పుడు, పరీక్ష ఫీజు కట్టేటప్పుడు, కనీసం పరీక్ష రాసేటప్పుడైనా ‘వర్శిటీ’ అధికారులకు అనుమానం రాలేదేమిటి? అనేగా మీ ప్రశ్న. అయితే మీరు ఈ స్టోరీ చదవండి. అయినా కుక్కకు ఎంబీఏ సర్టిఫికెట్ ఇఛ్చిన ఆ తిక్క యూనివర్సిటీ పేరు అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ లండన్. 1984 లో దీనిని లండన్ లో స్థాపించారు. మొదట, ఈ యూనివర్శిటీ దూరవిద్య నందించేంది. అప్పుడు ఆ ‘వర్శిటీ’ పేరు ‘అమెరికన్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’. ఆ తర్వాత దాని పేరు మార్చుకుంది. కేవలం లండన్ లోనే కాకుండా తమ శాఖను సౌదీ అరేబియాకు విస్తరించింది.
కేవలం డబ్బే లక్ష్యంగా పని చేస్తున్న ఈ వర్శిటీ కి అడ్మిషన్ తీసుకోబోయే వారి వివరాలే కాదు ఫైనల్ పరీక్షలకు హాజరుకాకపోయినా పట్టించుకోదు. పాసైనట్లు డిగ్రీ సర్టిఫికెట్ మాత్రం చక్కగా కొరియర్ ద్వారా మనకు అందిస్తుంది. ఈ విషయం నిజమా? కాదా? అనే అనుమానం వచ్చిన అంతర్జాతీయంగా ఖ్యాతి నార్జించిన బ్రిటన్ లోని ఒక ప్రముఖ న్యూస్ చానల్ ఓ ప్రయోగం చేసింది. ఒక జాగిలం పేరిట ఎంబీఏ డిగ్రీ కోసం సుమారు రూ.5 వేలు దరఖాస్తు ఫీజు చెల్లించింది. ఈ దరఖాస్తును స్వీకరించినట్లు వర్సిటీ నుంచి ప్రత్యుత్తరం రావడంతో, కోర్సు ఫీజుగా సుమారు రూ.4.50 లక్షలు కట్టింది. కొద్దిరోజుల తర్వాత శునకం పేరిట ఎంబీఏ పట్టాను సాక్షాత్తు వర్సిటీ అధికారులే కొరియర్ చేశారు. ప్రతీ కుక్కకు ఓ రోజు వచ్చినట్లే దీనికి ఓ రోజు వచ్చింది అందుకే ఎంబీఏ పూర్తి చేసినట్లు సర్టిఫికెట్ పొందింది.