గడియారం రిపేర్ కు 400 కోట్లు!!

October 19, 2015 | 02:16 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Big_Ben_repair_400_crores_niharonline

లండన్‌ అనగానే గుర్తొచ్చే వాటిల్లో బిగ్‌బెన్‌ గడియారం ఒకటి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ అతిపెద్ద గడియారం త్వరలో మూగబోనుంది. అయ్యో అనుకోకండి. ఇది తాత్కాలికమే. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గుర్తింపు పొందిన క్లాక్ టవర్లలో ఒకటిగా ఉన్న లండన్ బిగ్ బెన్ కొద్దికాలంపాటు మాత్రమే ఆగిపోనుంది. అత్యవసర మరమ్మతులు చేయాల్సి వుందని సాంకేతిక నిపుణులు స్పష్టం చేయడంతో, కొన్ని నెలల తరబడి గడియారం పని చేయదని తెలుస్తోంది.

 బ్రిటన్ రాజధాని లండన్ నడిమధ్యన ప్యాలెస్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ లో భాగంగా 1859లో ఏర్పాటైన బిగ్ బెన్ ఎంతో ప్రఖ్యాతి చెందిన సంగతి తెలిసిందే. ఈ గడియారాన్ని మరింత కాలం పాటు పనిచేయించడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న లండన్ ప్రభుత్వం అందుకోసం 40 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 400 కోట్లు) ఖర్చవుతుందని అంచనా వేస్తోంది. 156 ఏళ్ల నుంచి పనిచేస్తున్న గడియారాన్ని 1976లో మరమ్మతులు చేసే నిమిత్తం 26 రోజుల పాటు ఆపివేశారు. గడియారంలోని పలు లోహ భాగాలు తప్పు పట్టాయని, పైకప్పుకు బీటలు వారాయని తెలుస్తోంది. ఈ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో స్పష్టత రానప్పటికీ, వచ్చే రెండేళ్లలో మరమ్మతులు తప్పనిసరని సమాచారం. మొత్తం 315 అడుగుల ఎత్తయిన టవర్ లోపలికి వెళ్లి చూడాలంటే, 334 మెట్లను ఎక్కాల్సి వుంటుంది.

1844 లో దీని నిర్మాణం ప్రారంభం అవ్వగా, పూర్తికావటానికి సుమారు 15 సంవత్సరాలు పట్టింది. 1859 సెప్టెంబర్‌ 7 నుంచి పనిచేయడం మొదలు పెట్టాయి. బ్రిటన్‌ పార్లమెంటు భవనంలో భాగంగా ఉండే దీనికి సమీపంలోనే థేమ్స్‌ నది ప్రవహిస్తోంది. నది ఒడ్డున భూగర్భంలో మురుగు నీటి కాల్వల కోసం, కార్‌ పార్కింగ్‌ కోసం నిర్మాణాలు జరుగుతున్నాయి. దీని వల్లే బిగ్‌బెన్‌ దృఢమైన పునాదిని కోల్పోయి ఒక వైపుగా ఒరుగుతున్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ