ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సోషల్ మీడియా సైట్లు హ్యాకర్ల బారీ నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మెజార్టీ ప్రజలు ఉపయోగించే ఫేస్ బుక్ గురించి ఇప్పుడోక వార్త కలవర పెడుతోంది. యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్ బుక్ నుంచి సులువుగా దొంగిలించడానికి వీలుందని బ్రిటన్ కు చెందిన సాప్ట్ వేర్ ఇంజనీర్ రజా మెయినుద్దీన్ నిరూపిస్తున్నాడు. మీ అకౌంట్ లో ప్రొఫైల్లో ఫోన్ నంబర్ ఫీడ్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించమని సలహా ఇస్తున్నాడు.
యూజర్స్ ఫోటోలు అప్ లోడ్ చేసేప్పుడు ఫోన్ నంబర్ కూడా యాడ్ చెయ్యాలంటూ ఫేస్ బుక్ గత కొంత కాలంగా ప్రొత్సహిస్తూ వస్తుంది. అయితే అది అంత మంచిది కాదని ఈ యువ టెక్కీ అంటున్నాడు. ఫోన్ నంబర్ ద్వారా యూజర్ పేరును, ఫోటో లోకేషన్, ఇతరత్రా సమాచారాన్ని సులువుగా దొంగిలించవచ్చని, అభ్యంతరకర కామెంట్లకు కూడా అవకాశం ఉంటుందని చెబుతున్నాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే సెట్టింగ్స్ లో హూ కెన్ ఫైండ్ మీ లో పబ్లిక్ ఆప్షన్ తొలగించడంతో పాటు ఫోన్ నంబర్ ను అసలు యాడ్ చెయ్యకుండా ఉంటే మంచిని అతను హెచ్చరిస్తున్నాడు.