చార్టీ హెబ్డో పత్రికా కార్యాలయంపై దాడిచేసిన ఉగ్రవాదులను ఎట్టకేలకు పోలీసులు మట్టుబెట్టారు. పత్రికా కార్యాలయంపై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపి 12 మందిని చంపిన సంగతి తెలిసిందే. అనంతరం ఓ మహిళను బంధీగా చేసుకోని తప్పించుకోవాలన్న ఉగ్రవాదుల ప్రయత్నాలు ఫలించలేదు. పగలంతా ఉగ్రవాదులతో మంతనాలు చేసిన పోలీసులు రాత్రి కాగానే వారిపై విరుచుకపడ్డారు. వారి చెరలో బందీగా ఉన్న మహిళను రక్షించగలిగారు. మరోవైపు ఇద్దరు ఉగ్రవాదులపై దాడులను నిలిపివేయాలని ఐదుగురిని బందీలుగా పట్టుకున్న మరో ఉగ్రవాదిని కూడా పోలీసులు కాల్చివేశారు. అయితే ఈ ఘటనలో ఉగ్రవాది చెరలో ఉన్న ఐదుగురు బందీల్లో నలుగురు మరణించారు. ఓ వ్యక్తిని మాత్రమే ప్రాణాలతో కాపాడగలిగారు. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో ఆపరేషన్ పూర్తయినట్లు పారిస్ మేయర్ ప్రకటించారు.