దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా ఇండియన్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసి మూడు చెరువుల నీళ్లు తాగించాడు అండర్ వరల్డ్ మాఫియా డాన్ చోటా రాజన్. పలు దేశాలు తిరుగుతూ ఎట్టకేలకు ఇండోనేసియా నగరం బాలిలో పట్టుబడ్డాడు. ప్రస్తుతం ఈ డాన్ బాలి జైలులో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎలాగైనా చోటా రాజన్ ను భారత్ రప్పించాలని ప్రయత్నిస్తుంటే, భారత్ వెళితే తనను చంపేస్తారని రాజన్ ఆరోపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో చోటా రాజన్ ఓ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇప్పటిదాకా తన జీవితం మొత్తం ఉగ్రవాదంపై పోరు తోనే సరిపోయిందని చెప్పుకొచ్చాడు. మరో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చేసే ఉగ్రవ్యతిరేక కార్యాకలాపాలకు వ్యతిరేకంగా తాను పోరాడానని తెలిపాడు. మొదట్లో కేవలం స్మగ్లింగ్ చేసుకునే క్రమంలో దావూద్ ఆపై ఉగ్రవాదులతో చేతులు కలిపాడని, ఈ విషయాన్ని తాను విభేదించి పక్కకు వచ్చానని ఆ తర్వాతే తమ మధ్య పోరు జరుగుతుందని పేర్కొన్నాడు. ఉగ్రవాదంపై తాను చేసిన పోరాటాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తానని కూడా రాజన్ పేర్కొన్నాడు.
తొలుత దావూద్ ఇబ్రహీంతో కలిసి పనిచేసిన చోటా రాజన్, ముంబై పేలుళ్ల ఘటనను విభేదించి దావూద్ కు దూరమయ్యాడు. అప్పటి నుంచి దావూద్, చోటా రాజన్ గ్యాంగ్ ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉంది. ఇక దావూద్ కుడి భుజం చోటా షకీల్ పలుమార్లు చోటా రాజన్ ను మట్టుబెట్టేందుకు యత్నించాడు. అయితే దాడి జరిగిన ప్రతిసారి చోటా రాజన్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. చివరకు ఆస్టేలియన్ పోలీసుల సమాచారంతో ఇండోనేషియాలో అరెస్టయ్యాడు. మరి ఇప్పుడు దావూద్ పై భవిష్యత్తులోనూ పోరు సాగిస్తానని రాజన్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.