గల్లంతయిన రష్యా విమానం కూలిపోయినట్టు ఈజిప్టు ప్రధాని కార్యాలయం ధ్రువీకరించింది. ఐఎస్ఐఎస్ టెర్రరిస్ట్ లు ఈ ఘటనకు కారణంగా అనుమానిస్తున్నారు. మొత్తం 224 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్లు సమాచారం. వారి ప్రాబల్యం అధికంగా ఉన్న సినాయ్ ప్రాంతంలోనే ఈ ప్రమాదం జరగటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది.
విమానం ఈజిప్టులోని షర్మ్- ఎ- షేక్ రిసార్టు నుంచి రష్యాకు బయల్దేరింది. అక్కడినుంచి బయల్దేరగానే సాంకేతిక సమస్యలు తలెత్తాయని, రిసార్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే దీన్ని పైలట్ గుర్తించారని రష్యా టీవీ వర్గాలు చెబుతున్నాయి. కైరోలో అత్యవసర ల్యాండింగ్ కోసం ప్రయత్నించారని, కానీ అటువైపు వెళ్తుండగానే సమస్య తీవ్రమైందని అన్నారు. సైప్రస్‌లోని లార్నా ప్రాంతంలో విమానం కూలిందని చెప్పారు.
కాగా, ఈ ఘటనపై భిన్న కథనాలు వెలువడుతున్నాయి. ముందుగా గల్లంతయిన విమానం సురక్షితంగా ఉన్నట్టు రష్యా ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ విమానం కూలిపోయినట్టుగా ఈజిప్టు నిర్ధారించింది. దీనిపై ఈజిప్టు ప్రధానమంత్రి షరీఫ్ ఇస్మాయిల్.. కేబినెట్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేశారు.
ప్రయాణికులలో 17 మంది పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువమంది పర్యాటకులే ఉన్నారు. వీరిలో ఎవరి ఆచూకీ తెలియకపోవడంతో.. అంతా మరణించి ఉండొచ్చని చెబుతున్నారు. కాగా, ఇదే ఎయిర్ లైన్స్ విమానాలకు గతంలో చాలానే ప్రమాదాలు సంభవించటంతో విమాన నాణ్యతపై కూడా అనుమానాలు వినిపిస్తున్నాయి.