గతంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పేరును తప్పుగా ఉచ్చరించినందుకు దూరదర్శన్ యాంకర్ ఉద్యోగాన్ని కోల్పోయిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. భారత పర్యటనకు వచ్చిన ఆయన పేరును Xi అని ఉండటంతో పొరపాటున పదకొండు అనుకుని ఉచ్చరించిన పాపానికి అన్ని చానళ్లలో ఆమె హైలెట్ అయిపోయింది. ఇక ఇప్పుడు మరో చానెల్ చేసిన తప్పు ఏకంగా నలుగురి ఉద్యోగాలకు ఎసరు పెట్టింది. అయితే ఈసారికి సొంత మీడియానే ఆ చేష్టలకు పాల్పడింది. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ రాజీనామా చేశారంటూ చైనా వ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనం రేగింది.
పలు వెబ్ సైట్లు, టీవీ చానళ్లలో ఫ్లాష్ న్యూస్. ఈలోగా తెలిసిన మరో నిజం. జిన్ పింగ్ రాజీనామా చేయలేదని! తప్పును సరిచేసుకున్నా, అప్పటికే కొన్ని వందల వెబ్ సైట్లలోకి వార్త చేరిపోయి ప్రజలను అయోమయానికి గురిచేసింది. ఇంతకీ అసలేమైందంటే, చైనా - ఆఫ్రికా సదస్సులో భాగంగా జొహాన్నెస్ బర్గ్ లో జరిగిన సదస్సులో జిన్ పింగ్ ప్రసంగించారు. చైనా భాషలో ప్రసంగం అంటే కీ జీ. రాజీనామా అంటే జీ కీ. కాస్త అటు ఇటుగా ఆ పదాలు మారటంతో మొత్తం అర్థం మారిపోయి రాజీనామా చేశారంటూ వార్తలు వచ్చేశాయి. ఆ ప్రసంగాన్ని కవర్ చేసిన చైనా న్యూస్ సర్వీస్ కూడా అదే తప్పు చేసింది. దీంతో పెను దుమారమే చెలరేగింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ, నలుగురు ఉద్యోగులను సదరు వార్తా సంస్థ తొలగించిందట.