అడాల్ఫ్ హిట్లర్ ఈ శతాబ్దంలో చేసిన మారణహొమం చరిత్రలో మరువరానిది. మొదటి ప్రపంచ యుద్ధంలో పనిచేసిన హిట్లర్ జర్మనీ ఓటమి వలన అవమానంచెందాడు. పగతీర్చు కోవాలనే పట్టుదల వహించాడు. యుద్ధానికి ముందే వియన్నామేయర్ కార్త్లూగెర్ నుండి సోషలిస్టు భావాలను, జార్జివాన్ షొవెరర్ నుండి యూదుల పట్ల ద్వేషాన్ని నేర్చుకున్న హిట్లర్. సైన్యానికి రాజకీయ విద్య గడాపాలనే విథానాన్ని లుడెస్ డారప్ నుండి తెలుసుకున్నాడు. ఆపై జరిగిందంతా మనకు తెలిసిందే. అలాంటి నియంత రాసిని మేనిఫెస్టో పుస్తకం మళ్లీ కొత్తగా తిరిగి మార్కెట్ లోకి రానుంది. గతంలో 600 పేజీలతో వచ్చిన మేనిఫెస్టో ఈసారి 2000 పేజీలతో రానుంది. ఆయన రాసిన మేనిఫెస్టోను యథాతథంగా ప్రచురిస్తూనే, అందులో ఆయన ఆడిన అబద్ధాలు, అప్పటి ఆయన మనసులో నిగూఢమైన భావాలకు భాష్యం చెబుతూ సరికొత్తగా ఈ పుస్తకం రూపొందుతోంది. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ హిస్టరీ ప్రచురిస్తున్న ఈ పుస్తకం మరో వారం రోజుల్లో మార్కెట్ లోకి రానుంది. గతంలో ఈ పుస్తకాన్ని ముద్రించినప్పుడు పెట్టుకున్న కాపీ రైట్ హక్కు (హిట్లర్ మరణించినప్పటి నుంచి 70 ఏళ్ల పాటు) గడువు డిసెంబర్ 31తో ముగిసింది.
దీంతో ఈ పుస్తకం సరికొత్తగా ముద్రితం కానుంది. హిట్లర్ ఈ పుస్తకాన్ని (మెయిన్ కాంఫ్) రెండు భాగాలుగా 1923 నుంచి 1933 మధ్యలో ప్రచురించారు. ఈ పుస్తకాలు 40 లక్షల కాపీలు అమ్ముడు పోయాయి. ఇప్పటికీ హిట్లర్ ను, ఆయన ఫిలాసఫీని ఆరాధించే అభిమానులు జర్మనీలో ఉండడంతో విశ్లేషణలు, వాస్తవాలు లేకుండా ఈ పుస్తకం ముద్రించరాదని జర్మన్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ పుస్తకం సమకాలీన చరిత్రకు అవసరం లేకపోయినా గత చరిత్ర వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో దీనిని ప్రచురిస్తున్నట్టు ప్రచురణ సంస్ధ ప్రకటించింది.