ఎడ్వర్డ్ స్నోడెన్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన రహస్యాలను బయటి ప్రపంచానికి వెల్లడించి, ఆ దేశానికి నిద్రలేని రాత్రులను మిగిల్చిన విజిల్ బ్లోయర్. తాజాగా సామాజిక మాధ్యమం ట్విట్టర్ లోకి ప్రవేశించారు. ఆయనకు నెటిజన్ల నుంచి ఘన స్వాగతం లభించింది. ఆయనను ఫాలో అవుతామని వస్తున్న వారితో ట్విట్టర్ సైతం వణకాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆయన "కెన్ యూ హియర్ మీ?" అంటూ తొలి ట్వీట్ ను పెట్టగా 45 నిమిషాల్లో ఆయనను ఫాలో అయిన వారి సంఖ్య లక్షను దాటింది.
ఒక్క రోజులో ఆయన వెనుక నడుస్తామని వచ్చిన వారి సంఖ్య 7.79 లక్షలకు చేరింది. నిమిషానికి 3 వేల మందికి పైగా కొత్త ట్విట్టర్ ఖాతాదారులు ఆయనకు ఫాలోవర్లుగా మారుతున్నారు. మరో 4 రోజుల్లో ఈ సంఖ్య 50 లక్షలకు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్విట్టర్ ద్వారా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చెబుతారోనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. మరి ట్విటర్లో ట్వీట్ లతో ఎన్ని బాంబులు పేలుస్తాడో అని ప్రపంచ నేతలంతా ఆసక్తితో చూస్తున్నారు.