దేశాధ్యక్షులకు 'చెత్త' తిండి పెట్టారు

September 28, 2015 | 02:52 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Vegetables_Dining_for_Leaders.jpg

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. కానీ అన్నమో రామచంద్ర అనే వాళ్లు కొందరైతే, ఆ అన్నాన్నే (ఆహార ఉత్పత్తులను) వ్యర్థం చేసే వాళ్లు మరికొందరు. ఆహార ఉత్పత్తుల వ్యర్థాలు పెరిగిపోయడం గమనించి ఆందోళన చెందిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రపంచ దేశాధినేతలకు పాఠం చెప్పాలని భావించి వినూత్న నిర్ణయం తీసుకుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే సహా 30 దేశాల అధినేతలు, రాజుల బృందానికి ఆహార వ్యర్థాలతో తయారు చేసిన శాకాహార వంటకాలను వడ్డించింది. "మా లంచ్ కి ఉపయోగపడకుంటే, ఈ ఆహార పదార్థాలన్నీ భూమిలోకి చేరిపోయేవి. ఆపై మిథేన్ తదితర వాయువులను వాతావరణంలోకి కలిపేవి" అని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ వ్యాఖ్యానించారు.

పనికిరానివని పారేయబోసిన కూరగాయలు, ఉత్పత్తులతో తమ లంచ్ తయారైందని తెలిపారు. ప్రపంచ పర్యావరణ వ్యవస్థకు ఆహార ఉత్పత్తులు, వ్యవసాయం అత్యంత కీలకమని అందరికీ తెలియజెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అందుబాటులో ఉన్న ఫుడ్ ప్రొడక్టుల్లో మూడింట ఒక వంతు ఎవరికీ ఉపయోగపడకుండా వృధా అవుతున్నాయని ఆయన గుర్తు చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతియేటా 100 కోట్ల టన్నుల ఆహారం వినియోగంలోకి రాకుండా పోవడం వ్యవస్థకు సిగ్గుచేటని, ఈ ఆహారం సక్రమంగా వాడితే, ఆకలి బాధన్నదే ఉండదని అన్నారు. కాగా, ఈ విందును కూరగాయలు తరిగిన తరువాత మిగిలిన ముక్కలు, వివిధ రకాల ఆకులు, పెద్ద పెద్ద ఆహార ఉత్పత్తిదారుల నుంచి సేకరించిన 'వేస్టే', అటూ, ఇటూ కట్ చేసిన కీరా, మొక్కజొన్న విత్తనాలు వలిచేసిన తరువాత మిగిలే దుంపలు, వివిధ రకాల గింజల నుంచి నూనెలను తీసిన తరువాత మిగిలే పిప్పి తదితరాలను సేకరించి లంచ్ తయారు చేయగా, బాన్ కీ మూన్ ఆలోచనకు విందుకు హాజరైన వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఏదేమైనప్పటికీ, పంచ భక్ష పరమాన్నం తినే మహామహుల చేత చెత్త తిండి తినిపించిన ఘనత ఐరాసదే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ