విమానం హైజాక్ వెనుక సిల్లీ రీజన్ తెలుసా?

March 29, 2016 | 04:39 PM | 3 Views
ప్రింట్ కామెంట్
egyptair-hijack-cyprus-cause-niharonline

మొత్తం 81 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది ఉన్న ఈజిప్ట్ ఎయిర్ విమానం ఒకటి హైజాక్ అయ్యిందన్న వార్త మంగళవారం ఉదయం నుంచి కలకలం రేపిన సంగతి తెలిసిందే. తొలుత ఐఎస్ ఉగ్రవాదులు హైజాక్ చేశారని వదంతులు వ్యాపించడంతో అంతా హడలిపోయారు. అయితే హైజాక్ కు దారి తీసిన కారణం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.

              ఈజిప్ట్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఇబ్రహీం సమాహా గతంలోనే భార్యతో విడిపోయాడట. సమాహా ఈజిప్ట్ లో ఉండగా, ఆయన మాజీ భార్య మాత్రం సైప్రస్ లో ఉంటోందట. మాజీ భార్యను కలిసేందుకు బయలుదేరిన సమాహా ఏకంగా ఫ్లైట్ నే హైజాక్ చేశాడు. అలెగ్జాండ్రియా నుంచి కైరోకు బయలుదేరిన ఈజిప్ట్ ఎయిర్ విమానం ఎక్కిన సమాహా నడుముకు బెల్టు బాంబు కట్టుకుని కాక్ పిట్ లోకి వెళ్లి పైలట్ ను బెదిరించి విమానాన్ని సైప్రస్ తిప్పించాడు.

                       సైప్రస్ లో విమానం ల్యాండవగానే, తన డిమాండ్ నెరవేరేదాకా ప్రయాణికులను వదిలేది లేదని చెప్పిన సమాహా, ఆ తర్వాత ఐదుగురు విదేశీ ప్రయాణికులు, విమాన సిబ్బందిని బందీలుగా పట్టుకుని మిగిలిన వారందరినీ వదిలి పెట్టేశాడు. ఆ తర్వాత తనతో సంప్రదింపులు జరిపిన అధికారులకు అతడు తన డిమాండ్ ను తెలిపాడు. మాజీ భార్యను తన వద్దకు తెస్తేనే, బందీలను వదిలిపెడతానన్న సమాహా డిమాండ్ విని అధికారులు షాక్ తిన్నారు. ఇంత చిన్న కారణానికి ఏకంగా విమానాన్నే హైజాక్ చేస్తాడా? అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అతడి బందీలుగా ఉన్న విదేశీ ప్రయాణికులను సురక్షితంగా విడిపించేందుకు సమాహా భార్యను అక్కడికి రప్పించేందుకు సైప్రస్ అధికారులు చర్యలు చేపట్టారు. విశ్వవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరుగుతున్న దరిమిలా ఇలా ఈజిప్ట్ ఎయిర్ విమానం హైజాక్ సాధారణంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ