9/11 ఇది వినగానే అమెరికాలో ట్విన్ టవర్స్ ను కూల్చివేత ఘటన గుర్తుకు రాక మానదు. అమెరికాకు కొంతకాలంపాటు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ ఘటనకు కారణమైన ఘటన ఇప్పుడు బయటపడింది. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. ఈ ఘటనకు లాడెన్ ను పురిగొల్పిన ఘటనపై 'ద అన్ టోల్డ్ స్టోరీ' అంటూ ఉగ్రవాద సంస్థకు చెందిన 'ఆల్ మస్రా' పత్రిక ఓ కథనం ప్రచురించింది.
217 మంది మృతికి కారణమైన ఈజిప్టు ఎయిర్ లైన్స్ ప్రమాదం లాడెన్ కు స్పూర్తినిచ్చిందట. 1999లో ఈజిప్టు ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ ఫ్లైట్ 990 లాస్ ఏంజిలెస్ నుంచి కైరోకు ప్రయాణిస్తూ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో 217 మంది మృత్యువాతపడగా, అందులో సగం మంది అమెరికన్లే ఉన్నారు.
ఇంజిన్ ఫెయిల్ కావడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఈజిప్టు అధికారులు తేల్చగా, అమెరికా దర్యాప్తు విభాగం కో పైలట్ జమీల్ ఆల్ బటౌటీ విమానాన్ని ఉద్దేశ్యపూర్వకంగా విమానాన్ని సముద్రంలో ముంచేశాడని తేల్చింది. ఈజిప్టు ఎయిర్ లైన్స్ క్రమశిక్షణకు వ్యతిరేకంగా అతనీ దారుణానికి తెగబడినట్టు తేల్చారు. ఈ వార్త 'ఆల్ మస్రా'లో చదవిన లాడెన్ అనవసరంగా నీట్లో ముంచేశాడని, భవనాన్ని ఎందుకు ఢీ కొట్టలేదని ఆవేశంతో ప్రశ్నించాడు. అప్పుడే ఒసామా బిన్ లాడెన్ కు విమానాలతో భవనాలను ఢీ కొట్టాలనే ఆలోచన వచ్చిందని 'ఆల్ మస్రా' వెల్లడించింది.
అయితే లాడెన్ ఆలోచనకు అతని అనుచరుడు ఖలీద్ తన ఆలోచనను జోడిస్తూ, అమెరికా విమానాలతోనే అమెరికాను దెబ్బతీయాలని నిర్ణయించాడు. అందులో భాగంగా అమెరికా విమానాలను హైజాక్ చేసి లాడెన్ ఆలోచనను అమలు చేశారని ఆ కథనం సారాంశం.