స్కూల్ లైఫ్ లో మీరూ హోంవర్క్ రాసే ఉంటారుగా. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పుస్తకంలోని పాఠాలకు సంబంధించి, లేదా స్వాతంత్ర్య సమర యోధుల జీవిత చరిత్ర గురించి మరి మించితే విహార యాత్ర అనుభవాలు రాయమని టీచర్లు మనకు చెప్పటం. రాత్రిళ్లు నానాతంటాలు పడి అమ్మ హెల్ప్ తోనో, అన్న సాయంతోనే పూర్తి చేసి ఊప్... అనుకుంటూ తిరిగి పొద్దున బడికి బయలుదేరటం చిన్నప్పుడు అందరం చేసేవాళ్లం. ఆ రోజులే వేరు లేండి.
కానీ, ఇప్పుడు కాలం మారింది. అఫ్ కోర్స్ సిలబస్ కూడా మారిందనుకోండి. ఇప్పుడున్న విద్యార్థులు కొత్త కొత్త టాపిక్ లతో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. వారికి తగ్గట్టే టీచర్లు కూడా తయారయిపోతున్నారు కూడా. ఇప్పుడిదంతా ఎందుకంటారా? అక్కడికే వస్తున్నాం... ఇంగ్లండ్ లోని ఓ పాఠశాలలో టీచర్ ఇచ్చిన హోంవర్క్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వటం మీవంతు అవుతుంది. ఎందుకంటారా ఇచ్చింది. 'సూసైడ్ నోట్'ను హోం వర్క్ గా ఇచ్చి ఓ లేడీ టీచర్ గారు కలకలం రేపారు. ఎసెక్స్ లోని విక్ ఫోర్డ్ లోని బ్యూచాంప్స్ హైస్కూలు విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్ లో భాగంగా... 'ది లాస్ట్ జర్నీ' పాఠం పేరిట ఈ పని చేసుకుని రమ్మనారట. సూసైడ్ కు ముందు కలిగే ఆలోచనలు రాసి తీసుకురావాలని ఈ టాపిక్ ను స్టూడెంట్స్ కి అప్పజెప్పారట.
ఇక ఈ ఈ విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిండా 15 ఏళ్లు కూడా లేని పిల్లలకు ఇలాంటి హోం వర్క్ లు ఇస్తే, వారిలో ఎలాంటి ఆలోచనలు రేకెత్తుతాయంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై వీరంతా కలసి పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. దీనిపై ఆ హోం వర్క్ ఇచ్చిన టీచర్ మాట్లాడుతూ, స్కూలు సిలబస్ లో ఉన్నవాటిపైనే తాము హోం వర్క్ ఇస్తామని, పాఠ్యాంశంలో ఉన్న అంశంపైనే తాను హోం వర్క్ ఇచ్చానని, ఇందులో తన తప్పేమీ లేదని ఆమె స్పష్టం చేశారు. దీంతో స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పిందట.