ప్చ్... అదృష్టం అంటే ఆ సంస్థ ఉద్యోగులదే. క్రిస్మస్ బోనస్ మాములుగా కాదు జాక్ పాట్ రూపంలో కొట్టారు ఆ కంపెనీ ఉద్యోగులంతా. అది కూడా అలాంటి, ఇలాంటి కానుక కాదు. ఏకంగా ఒక్కో ఉద్యోగికీ రూ. 66.30 లక్షల బోనస్. మొత్తం 1400 మందికి పైగా ఉద్యోగులతో ఇంధన వనరుల సంస్థగా సేవలందిస్తున్న 'హిల్ కార్ప్' ఈ బోనస్ ను ప్రకటించి, ఉద్యోగుల్లో ఆనందాశ్చర్యాలను పెంచింది. గత సంవత్సరం రూ. 20 లక్షలకు పైగా బోనస్, ఓ కారును అందించిన సదరు సంస్థ, ఈ ఏడు ఆ మొత్తాన్ని మూడింతలు పెంచింది.
ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోయినా, సహజవాయువు ఉత్పత్తి తగ్గినా, హిల్ కార్ప్ మాత్రం రెండింతల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించింది. దీనికి ఉద్యోగులే కారణమని నమ్మిన సంస్థ చైర్మన్ హిల్దే బ్రాండ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఇటీవలి ఫోర్బ్స్ జాబితా ప్రకారం హిల్దే ఆస్తుల విలువ 5.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 39 వేల కోట్లు). ఇక ఇప్పుడు ప్రకటించిన బోనస్ ఉద్యోగులకు వారం రోజుల ముందే క్రిస్మస్ కానుక అందింది.