జనాభాలో టాప్ పొజిషన్ లో ఉన్న చైనాను ఎలాగైనా అధిగమించాలని ఓవైపు భారత్ ప్రయత్నిస్తుంటే, మరోవైపు చైనా కూడా భారత్ కు కొలుకోలేని షాకిచ్చింది. అది పాపులేషన్ విషయంలోనో లేదా మరో ఇతర రంగాల్లోనో కాదు. అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోక మానరు. అవినీతి విషయంలో... అవునండీ నిజం. రైల్లో బెర్తు దగ్గరి నుంచి ఎమ్మార్వో ఆఫీసు సర్టిఫికెట్ దాకా, రిజిస్ట్రేషన్ ఆఫీసు, సినిమా హాల్ ఇలా ప్రతీ చోటా అవినీతిని ప్రజలే పెంచి పోషిస్తున్నారన్న విమర్శలు మనం వింటూ ఉంటాం. ఈ విషయంలో భారత్ ను కొట్టేవారే లేరని సిగ్గులేకుండా చెప్పుకుంటాం కూడా. అయితే ఇండియా కన్నా, చైనాలోనే లంచగొండితనం అధికంగా ఉందట.
అవినీతి విషయంలో చైనాతో పోలిస్తే భారత ర్యాంకు మెరుగ్గా ఉందని ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ తాజాగా విడుదల చేసిన అధ్యయనం ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది. మొత్తం 175 దేశాలను భాగస్వామ్యం చేస్తూ, సర్వే నిర్వహించి, అతి తక్కువగా అవినీతి ఉన్న దేశాల నుంచి మొదలు పెట్టి ర్యాంకులివ్వగా, ఇండియా 85వ స్థానంలో, చైనా 100వ స్థానంలో నిలిచాయి.
అవినీతి రహిత దేశాలను ఎంపిక చేసి పాయింట్లు ఇవ్వగా, నూటికి 38 పాయింట్లను ఇండియా పొందిందని, చైనాకు 36 పాయింట్లు వచ్చాయని తెలిపింది. సున్నా పాయింట్లు వస్తే, అత్యధిక అవినీతి ఉందని, 100 పాయింట్లు వస్తే నిజాయతీ నిండిన దేశమని భావించగా, ఏ దేశానికి కూడా 100 పాయింట్లు రాలేదని ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. జాబితాలో 92 పాయింట్లతో డెన్మార్క్, 91 పాయింట్లతో న్యూజిలాండ్, 89 పాయింట్లతో ఫిన్ లాండ్, 87 పాయింట్లతో స్వీడన్, 86 పాయింట్లతో నార్వే తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఆసియా నుంచి టాప్ 50 దేశాల్లో అవినీతిరహిత దేశం ఒకటి కూడా లేకపోవటం విశేషం.