ఈ మధ్య సోషల్ మీడియాకు బాగా ఎక్కేసిన పిచ్చి సెల్ఫీ. టైమూ, పాడూ లేకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా సెల్ఫీలు దిగి పెట్టేసుకోవటం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అలా ఓ యువతి ఉత్సాహాం ఆపుకోలేక చేసిన పని తన కొంపనే ముంచుతుందని ఆ యువతి బహుశా ఊహించి ఉండకపోవచ్చు.
పందెంలో దాదాపు రూ. 50 వేలు (900 ఆస్ట్రేలియన్ డాలర్లు)గెలుచుకుంది. ఆ ఆనందంలో గెలిచిన టికెట్ ను చూపిస్తూ సెల్ఫీ దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఆపై డబ్బుల కోసం పందాల నిర్వాహకులను సంప్రదించగా, అప్పటికే డబ్బు తీసుకెళ్లారని చెప్పడంతో కంగుతింది.
ఇంతకీ విషయమేంటంటే... ఆస్ట్రేలియాకు చెందిన చాంటెల్లే అనే ఓ యువతి గుర్రపు పందెంలో గెలిచింది. 'విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్' అంటూ, తనకు బహుమతిని తెచ్చిపెట్టిన టికెట్ ను అందరికీ కనిపించేలా సోషల్ మీడియా ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. అయితే దాన్ని చూసిన ఆకతాయిలు ఎవరో చక్కా ప్రింట్ తీసుకుని, దానిపైని బార్ కోడ్ నిర్వాహకులకు చూపించి డబ్బులు తీసుకెళ్లిపోయారు. తన ఫేస్ బుక్ స్నేహితులే ఎవరో ఈ పని చేసి వుంటారని చాంటెల్లే ఇప్పుడు వాపోతోంది. డబ్బులు తీసుకున్న తరువాత ఫోటో పంచుకుంటే బాగుండేదని వాపోతోంది. చేతుల కాలాక చెంపలు వాయించుకుంటే లాభం ఏముంటుంది లేండి. ఆ జాగ్రత్త ముందుండాలి గానీ అని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారట. అత్యుత్సాహం అనర్థాలకు మూలం అంటే ఇదేనేమో.