భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఇది మన చిన్నప్పటి నుంచి చదువుతుందే. ఆర్థిక సంస్కరణలు, టెక్నాలజీలు ఎన్ని వచ్చినా సరే ప్రగతి పథంలో మాత్రం భారత్ ఇంకా అభివృద్ధి చెందుతూ... ఉన్నదే. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు మాత్రం మన దేశ సంస్కరణలకు ఉన్న ప్రాధాన్యతను ఎప్పటికప్పుడు గుర్తిస్తాయి. ఆర్థికంగా వాటితో పోటీపడలేకపోయినప్పటికీ విజన్ లో ఇండియాకు కొట్టే దేశమే లేకపోవటంతో పైకి నవ్వుతూనే పరోక్షంగా మనపై అక్కసు వెల్లగక్కుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై జరిగిన సదస్సులో భారత్ ప్రధాన పాత్రను పోషించిన వేళ అగ్ర దేశాలు సైతం ఇందులో భాగస్వాములుగా మారుతున్నాయి. ఇటీవల న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ ఏనుగు, ట్రైన్ ను ఆపుతున్నట్టుగా ఓ కార్టూన్ ను గీసి, వాతావరణాన్ని కాపాడేందుకు ఇండియా ప్రయత్నం ఇలాగే ఉందన్న మీనింగ్ వచ్చేలా చూపి విమర్శల పాలైంది.
ఇక ఇప్పుడు ఓ ఆస్ట్రేలియా దినపత్రిక భారతీయులపై జాత్యహంకారాన్ని చూపేలా ఓ కార్టూన్ ను ప్రచురించి తన అక్కసు తీర్చుకుంది. 'ది ఆస్ట్రేలియన్' పత్రికలో వచ్చిన ఈ కార్టూన్ పై ఇప్పుడు విమర్శలు చెలరేగుతున్నాయి.
బిల్ లీక్ అనే కార్టూనిస్టు దీన్ని గీయగా, పత్రిక తన సోమవారం నాటి సంచికలో ప్రచురించింది. ఈ కార్టూనులో సంప్రదాయ దుస్తులు, టర్బైన్లతో ఉన్న భారతీయులు, చీర కట్టుకున్న ఓ మహిళ, చిన్నారి ఉన్నారు. అమెరికా నుంచి దిగుమతి అయిన సోలార్ ప్యానళ్లను తినేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తుండగా, "అది మంచిది కాదు, వాటిని తినలేవు" అని ఓ వ్యక్తి అంటే, "ఓసారి తినిచూద్దాం, కాస్త మామిడికాయ పచ్చడి ఇవ్వు" అని రెండో వ్యక్తి చెబుతుంటాడు. కాగా, ఈ కార్టూన్ పై ఆస్ట్రేలియన్ ఎంపీ టిమ్ వాట్స్ స్పందిస్తూ, "ఇది కాస్త ఇబ్బందికరమే" అని ప్రకటించాడు.