ఐదు తరాలుగా ఆ ఇంట్లో ఆడపిల్లే లేదు. అంతా మగసంతానమే. ఆఖరికి రెండు శతాబ్దాల తర్వాత కుటుంబంలో పాప కావాలన్న వారి కల ఎట్టకేలకు నెరవేరింది. వివరాల్లోకి వెళ్లితే... లండన్ లోని లారీయ్ కుటుంబంలో 200 ఏళ్లుగా ఆడపిల్లలే లేరట. చివరిసారిగా 1809లో ‘గ్రేట్ గ్రాండ్ ఆంట్’ బెస్సీ జన్మించింది. అప్పుడు వారంతా సంబరాలు చేసుకున్నారట. అయితే ఆ తర్వాత ఐదు తరాల వారి వంశంలో అసలు ఆడ పిల్లలే పుట్టలేదట. ఎన్నోరకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ వారి కుటుంబంలో పాప పుట్టలేదని వారంతా దిగాలుగా ఉండేవారట. అయితే ఐదోతరానికి చెందిన మార్క్-హన్నా దంపతులకు నాలుగో సంతానంగా పాప పుట్టింది. దీంతో మళ్లీ ఇన్నేళ్లకు ఆ ఇంట్లో పసిపాపాయి పారాడటంతో ఆ కుటుంబం ఉబ్బితబ్బిబైపోతోంది. అంతేకాదు పుట్టిన ఆ పాపకు మిలా అని పేరు పెట్టి ఆ కుటుంబ సభ్యులంతా ముద్దు ముచ్చట్లు ఓ రేంజ్ లో చేస్తున్నారట. ఎట్టకేలకు వారి నిరీక్షణకు మిలా తెరదించింది.