అహింసా మార్గంలో పోరాటాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన శాంతిదూత మహత్మా గాంధీ. ప్రతియేటా ఆయన పుట్టినరోజు, వర్థంతి రోజున ప్రపంచ దేశాలన్నీ ఆయనను స్మరించుకుంటాయి. కొన్ని దేశాలైతే ఏకంగా ఆయన గౌరవార్థం విగ్రహాలను నెలకొల్పి ఏటా ఆయనను స్మరించుకుంటూ ఉంటాయి. ఇటీవల యూరప్ లోని స్లొవేనియా దేశం కూడా ఈ జాబితాలో చేరింది. ఆయన 67వ వర్థంతిని పురస్కరించుకుని ఈ స్మారక చిహ్నంను స్లొవెంజ్ గ్రాడెక్ నగరంలో ఏర్పాటుచేశారు. దీంతో కలుపుకొని ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 73 నగరాల్లో ఆయన విగ్రహాలను నెలకొల్పారు. ఈ విగ్రహాన్ని భారత్ ఆ దేశానికి బహుకరించటం విశేషం. ఇక నుంచి ఏటా అక్టోబర్ 2, జనవరి 30 న విగ్రహానికి నివాళులర్పించి స్మరించుకుంటారని అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది.