పారిస్ ఘటన మరువక ముందే మరో దేశంలో ఉగ్రవాదులు పంజా విసిరారు. పశ్చిమాఫ్రికా దేశాల్లో భాగమైన మాలీపై ఉగ్రవాదులు ఈ ఉదయం దాడిచేశారు. భారీగా పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రితో మాలీ రాజధాని బొమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్ పై దాడికి దిగిన 10 మంది ఉగ్రవాదులు హోటల్ లో ఉన్న 170 మందిని బందీలుగా పట్టుకున్నారు. వీరిలో 10 మందిని చంపేసినట్లు వార్తలు అందుతున్నాయి. బందీలుగా పట్టుబడిన వారిలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు, ఫ్రాన్స్ సైన్యాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. బొమాకోలో జరుగుతున్న ఓ సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాలకు చెందిన ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు ఉండటంతో మాలీ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం హోటల్ ను చుట్టుముట్టిన భద్రతా దళాలు బందీలను విడిపించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఆటోమేటెడ్ గన్స్, బాంబులతో హోటల్ లోకి ఇద్దరు ఉగ్రవాదులు చొరబడ్డారని కొందరు చెబుతున్నారు. హోటల్ లో చిక్కుకున్నానంటూ చైనాకు చెంది వ్యక్తి చైనా మీడియా సంస్థ జిన్ హువాకు సమాచారం అందించాడు. తనతోపాటు ఇంకొంత మంది కూడా చైనీయులు ఉన్నారని ఆయన పేర్కొన్నాడు. బందీలలో కొందరు ఖురాన్ పఠించడంతో ఉగ్రవాదులు వారిని వదిలేసినట్టు చెబుతున్నారు.
కాగా, అమెరికాకు చెందిన వారి యాజమాన్యంలో నడుస్తున్న ఈ హోటల్ మాలిలో మంచి హోటల్ గా పేరుతెచ్చుకుంది. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ హోటల్ ను చుట్టుముట్టాయి. హోటల్ నుంచి బయటకు దారితీసే ప్రతి దారిని దిగ్బంధం చేశారు. 170 మంది బందీల్లో 140 మంది విదేశీ అతిథులు ఉండగా, 30 మంది సిబ్బంది అని స్థానిక మీడియా ప్రకటించింది. అసలు చేసింది ఎవరూ? వారి లక్ష్యం ఏంటన్నది ఇంతవరకు తెలియపరచకపోవటంతో టెన్షన్ నెలకొంది.