టార్గెట్ చాలా పెద్దది. అయినా ఎలాగైనా సరే సాధించాలనుకున్నాడు. ఏకంగా రాష్ట్రాలు దాటుతూ సుదీర్ఘ ప్రయాణం చేసి దేశ రాజధాని నగరం చేరుకున్నాడు. ఈలోగా అతడి చంచల బుద్ధితో అనుకున్న పని సాధించకుండానే పోలీసులకు పట్టుబడిపోయాడు. తనను తాను కూడా ‘పెద్ద’గా అభివర్ణించుకున్నాడు ఓ అమెరికా పౌరుడు. వివరాల్లోకెళితే... అమెరికాలోని నార్త్ డకోటాలోని డాకిన్సన్ కు చెందిన స్కాట్ డీ స్టాకర్ట్.. దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన అధికారిక నివాసంలో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న రెండు కుక్క పిల్లల్లోని ఓ దానిని ఎత్తుకెళ్లడానికి దాదాపుగా నిర్ణయం తీసుకున్నాడు. ఇంకేముంది, డాకిన్సన్ నుంచి ఓ కారులో ఓ షాట్ గన్ తో పాటు మరో తుపాకీ, మందు గుండు సామగ్రి తీసుకుని బయలుదేరాడు.
ప్రయాణంలో అక్కడక్కడ ఆగుతూ వచ్చిన అతగాడు, తన లక్ష్యం గురించి తనను పలకరించిన వారందరికీ చెప్పుకుంటూ వచ్చాడేమో, మిన్నెసొటాలోని గూఢచారులకు ఈ విషయం తెలిసిపోయింది. వారు రంగంలోకి దిగేలోగానే మనోడు అక్కడి నుంచి వాషింగ్టన్ బయలుదేరేశాడు. దీంతో మిన్నెసొటలోని సీక్రెట్ ఏజెంట్లు వాషింగ్టన్ లోని తమ ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేశారు. అప్రమత్తమైన వాషింగ్టన్ సీక్రెట్ ఏజెంట్లు ఎట్టకేలకు మనోడిని ఓ హోటల్ లో గుర్తించారు. ఆరా తీస్తే... తాను జీసస్ అని ఓసారి, జాన్ ఎఫ్ కెన్నడీ, మర్లిన్ మన్రో కుమారుడినని మరోసారి చెప్పుకున్నాడు. దేశ అధ్యక్ష స్థానానికి జరిగే ఎన్నికల్లో కెన్నడీ వారసుడిగా బరిలో దిగుతున్నానని కూడా చెప్పాడు. ఇక లాభం లేదనుకున్న సీక్రెట్ ఏజెంట్లు ఆయుధాల గురించి ఆరా తీశారు. 'నిజమేగా, కారులో ఉన్నాయి చూడండి' అంటూ అతడు చూపించాడు. వెనువెంటనే ముసుగులు తీసేసిన సీక్రెట్ ఏజెంట్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన కాస్తంత ఆలస్యంగా నిన్న వెలుగుచూసింది. ప్రస్తుతం అతడిని వదిలేసిన పోలీసులు అతడిపై నిఘా మాత్రం కొనసాగిస్తున్నారుట.