నేను నిన్ను ప్రేమిస్తున్నాను... మూడు ముక్కలే అయనా చెప్పటానికి ధైర్యం లేని యువత ఎందరో ఉన్నారు. ఓకే చెబుతుందా లేదా అన్న టెన్షన్ లోనే చెప్పడానికి నానాపాట్లు పడతారు. ఒప్పుకోకపోతే బిల్డింగ్ లు, వాటర్ ట్యాంక్ లు ఎక్కి దూకుతానని బెదిరించటం మన దేశంలో మాములుగా కనిపించేదే. కానీ, విదేశాల్లో అలా కాదు. నచ్చితే డేటింగ్, ఆపై పెళ్లి. అయితే అక్కడ కూడా ప్రేయసికి ఇండియన్ స్టైల్లో ప్రపోజ్ చేద్దామనుకున్న ఓ యువకుడికి చిక్కులు ఎదురయ్యాయి. అంతేనా ఏకంగా ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వివరాల్లోకి వెళ్తే కాలిఫోర్నియాకు చెందిన మైఖేల్ బాంక్స్ (27) సెంట్రల్ కోస్ట్ లోని 600 అడుగుల ఎత్తున్న మొర్రో రాక్ అనే కొండను ఎక్కాడు. శిఖరాగ్రాన ఫేస్ టైమ్ ద్వారా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. ప్రియుడి సాహసాన్ని అభినందించిన ఆయువతి కొండ దిగివస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో కొండను దిగుతుండగా మైఖేల్ కొండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. ఈ విషయం ప్రియురాలికి ఫేస్ టైమ్ ద్వారా తెలిపాడు. వెంటనే స్పందించిన ఆమె అగ్నిమాపక దళానికి ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన అగ్నిమాపక దళం హెలికాప్టర్ సాయంతో అతనిని రక్షించారు. అనంతరం అతనిని తీసుకెళ్లి జైలులో పెట్టారు. అనుమతి లేకుండా నిషేధించిన కొండను నిబంధనలకు విరుద్దంగా ఎక్కడంతో అతనిని అరెస్టు చేసినట్టు తెలిపారు.