కార్లా జటింకో వయసు 23 సంవత్సరాలు. కానీ, 12 ఏళ్ల ప్రాయం నుంచే నరకం చవిచూసిందా యువతి. దాదాపు ఆరేళ్లపాటు వేశ్య వృత్తిలో ఆమె జీవితాన్ని నాశనం చేసిందో మానవ మృగం. ప్రేమించానన్నాడు, గిప్ట్ లు కొన్నాడు, మురిపించాడు, మోజు తీరాక నరకంలోకి తోసేశాడు. తనపై 43,200 సార్లు రేప్ జరిగిందని చెప్పిందా యువతి. తన జీవితంలో జరిగిన విషాదాన్ని వివరిస్తుంటే కంట తడి పెట్టని మనిషి ఉండటంటే నమ్మండి.
ఓ సంపన్న కుటుంబానికి చెందిన కార్లా జటింకో ను డబ్బు వ్యామోహంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేశారు. ఇక ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడే కుటుంబ సభ్యుడోకడు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడట. దీంతో యుక్తవయసు వచ్చాక స్నేహితులతో కలిసి బయట ఉండేదట. 12 ఏళ్ల వయసులో ఉండగా ఓరోజు సరదాగా బయటికి వెళ్లిన ఆమెను కల్లబొల్లి మాటలతో వలలోకి లాగాడు ఓ యువకుడు.
ఖరీదైన కారుతో ఆమె దృష్టిని ఆకర్షించి ఆపై ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆపై సహజీవనం చేసేందుకు ఆమెను ఒప్పించాడు. కన్నవారి ప్రేమకు దూరమైన కార్లా అతని మాయలో ఈజీగా పడిపోయింది. మూడు నెలలు గడిచాక వారుండే గదికి రోజుకో జంట వచ్చి వెళ్తుండేవారట. ఎవరని అడిగితే కజిన్స్ అని అబద్ధం చెప్పేవాడట. ఇక కొద్దిరోజులకు విషయం అర్థమై అతగాడిని నిలదీస్తే నువ్వు కూడా ఆ పనే చేయాలంటూ తనను ఆ వృత్తిలోకి దించాడని రోదిస్తూ చెప్పింది. ఉదయం 10 నుంచి మొదలుపెడితే ఏ టైంలో ముగిసేదో కూడా తెలిసేదీ కాదంట. ఆ సమయంలో నేను ఏడుస్తుంటే చాలా మంది గట్టిగా నవ్వేవారు. భయంతో నేను కళ్లు మూసుకునే దానిని వారు ఏం చేసేవారో నాకు తెలిసేది కాదు అని చెప్పుకోచ్చింది. ఒక్కొసారి ప్రతిఘటిస్తే తన ప్రేమికుడు గొలుసులతో బంధించి బాదేవాడట. అలా ఆరేళ్లపాటు నరకం అనుభవించానని చెబుతోంది. ఇలా ఉండగా 18 వయసులో ఉండగా మెక్సికో పోలీసుల సాయంతో ఆ భయంకర కూపం నుంచి బయటపడినట్లు తెలిపింది.
ప్రస్తుతం 23 ఏళ్ల వయసున్న ఈ యువతి లాయర్ కావాలన్నదే తన లక్ష్యమట. తనలా మరెవరి జీవితం కాకుడదని, అలాంటి వారి కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతోంది.