అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట అన్నడో కవి. పైగా అమ్మ అనే ఆ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. ఎందుకంటే, నిస్వార్థంగా, నిష్కల్మషంగా ప్రేమ, ఆప్యాయతలను కురిపించేది అమ్మ ఒక్కటే. అయితే కన్నతల్లిలా కాకపోయినా ఆ ప్రేమలో కాస్తైనా పంచుతామంటున్నారు ఓ సంస్థ వారు. అమ్మ దగ్గర లేని లోటును తీరుస్తామంటూ ‘నీడ్ ఏ మామ్’ అనే ఒక సంస్థ ముందుకు వచ్చింది. న్యూయార్క్ కు చెందిన నైనా కెనియల్లీ అనే 63 సంవత్సరాల మహిళ ఈ సంస్థను ప్రారంభించింది.
యోగ తరగతులు నిర్వహించే ఆమె దగ్గరికి యువతీ యువకులు ఎక్కవ సంఖ్యలో వస్తుంటారట. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నామన్న ఆవేదన కొంతమంది ఆమెతో వ్యక్తం చేస్తుండేవారట. అలా ఆ క్రమంలోనే ‘నీడ్ ఏ మామ్’ అనే సంస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆమెకు తట్టిందట. ‘ఉద్యోగాల నిమిత్తం న్యూయార్క్ నగరానికి వచ్చే యువతీ యువకుల సంఖ్య బాగానే ఉంటుంది. వారిలో చాలామంది తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామని బాధపడుతూ ఉంటారు. మంచి అయినా, చెడు అయినా ఏ విషయమైనా మన అన్న వాళ్లతో పంచుకుంటే బాగుంటుంది. ఆ ఆనందానికి యువత దూరమైపోతున్నారు. అలాంటి వారికి ఎంతో కొంత ఊరట కలిగించేందుకు ఈ సంస్థను మొదలు పెట్టాను’ అని చెబుతోందామో.
ఎవరైనా మా సంస్థలో సంప్రదించి ‘అమ్మ’ కావాలని కోరితే..ఎప్పుడు, ఎక్కడికి రావాలో తెలుసుకుని అక్కడికి పంపుతాము. కాకపోతే, గంటకు రూ.2,600 ఛార్జి చేస్తాము. అయితే, ఒక కొడుకుకి తల్లి చేసే పనులేవీ అమ్మగా అక్కడికి వెళ్లిన వ్యక్తులెవ్వరు చేయరు. కేవలం వాళ్లతో ఆప్యాయంగా మాట్లాడటం, కష్టసుఖాలను తెలుసుకోవడం.. సలహాలు, సూచనలు ఇవ్వడం, తల్లిలా ప్రేమ పంచడం చేస్తారు’ అని నైనా పేర్కొంది. ‘అమ్మ’ సేవలకు మంచి డిమాండ్ ఉందని, త్వరలోనే తమ సేవలను మరిన్ని నగరాల్లో విస్తరించే ఫ్లాన్ లో ఆమె ఉందట.