సుందర నగరం ఉగ్ర భీభత్సంతో రక్తసిక్తం

November 14, 2015 | 11:43 AM | 1 Views
ప్రింట్ కామెంట్
Paris_rocked_by_explosions_and_deadly_shootings

అగ్ర దేశం ఫ్రాన్స్ ఉగ్ర దాడితో వణికిపోయింది. రాజధాని ప్యారిస్ పై శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.  ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ప్రత్యక్షంగా ఫ్రాన్స్, జర్మనీ ఫుట్ బాల్ జట్ల మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరుగుతున్న సమయంలో మెరుపు దాడికి దిగిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. ఆరు చోట్ల కాల్పులు, మూడు చోట్ల బాంబు దాడుల్లో 170 మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. వందలాది మందికి గాయాలయ్యాయి. నగరంలోని బటక్లాన్ థియేటర్ వద్దే ఉగ్రవాదులు ఏకంగా వంద మందిని పొట్టనబెట్టుకున్నారు. థియేటర్లోని వారిని బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు వారిని నిలబెట్టి మరీ కాల్చి చంపారు.

                           మరింత మంది ఉగ్రవాదులు ప్యారిస్ లోకి చొరబడి ఉంటారన్న అనుమానంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు పరిస్థితిని సమీక్షించిన ఫ్రెంచ్ బలగాలు దేశం సరిహద్దులను మూసివేశాయి. ప్రస్తుతం ప్యారిస్ లో కాల్పులు జరిగిన ప్రాంతాల్లో భీతావహ వాతావరణం నెలకొంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు, పోలీసుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం 8 మంది ఐఎస్ ముష్కరులను ప్యారిస్ పోలీసులు మట్టుబెట్టారుట.

                                   ఇక  పెను దాడి వెనుక తామే ఉన్నట్లు ఐఎస్ ఐఎస్ ప్రకటించింది. సిరియా విషయంలో జోక్యం చేసుకున్నందుకే ఈ దాడి చేశామని దాడిలో పాల్గొన్న ఓ ఉగ్రవాది చెప్పినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్, నగరంలో విద్యా సంస్థలన్నింటికీ సెలవు ప్రకటించారు. అయితే నగరంలో రైలు, విమానాల రాకపోకలు యథాతథంగా కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదుల మెరుపు దాడితో నగరంలో భీతావహ వాతావరణం నెలకొంది. అత్యంత సుందరనగరంగా పేరొందిన పారిస్ రక్తపు మరకలతో దారుణంగా కనిపిస్తోంది. ఇక ఉగ్రవాదుల తూటాలకు ఆప్తులను కోల్పోయిన నగర జనం వెక్కి వెక్కి ఏడుస్తున్న వైనం ప్రపంచ దేశాలను కలచివేస్తోంది. మరో వైపు పలు దేశాల అధ్యక్షులు పారిస్ ఘటన పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ