టెన్నిస్ సంచలనం సెరీనా విలియమ్స్ కోర్టులో రాకెట్ తో బంతిని కొడితే ఆ ప్రాంతమంతా కేరింతలతో హోరెత్తిపోవాల్సిందే. తన ప్రత్యర్థులను అరుపులతో బెంబేలెత్తించి ఆటలో పట్టుసాధించటంలో ఈమె దిట్ట. వరుస గ్రాండ్ స్లామ్ లతో దూసుకుపోతున్న ఈ అమెరికన్ బ్లాక్ బ్యూటీ ఆట, అరుపుల్లోనే కాదండోయ్.., పరుగులోనూ నంబర్ వనే. మరి అలాంటావిడకు షాక్ ఇద్దామనుకుని ఘోరంగా భంగపడ్డాడు ఓ చోర శిఖామణుడు. ఇంతకీ విషయం ఏంటంటే... తన సోదరి వీనస్ విలియమ్స్, మరో టెన్నిస్ స్టార్ కరోలినా వోజ్నియాకిలతో కలిసి సెరెనా బుధవారం ఓ చైనీస్ రెస్టారెంట్ కు వెళ్లింది. బిజీగా ఉండే సదరు రెస్టారెంట్ లో ఓ టేబుల్ ముందు కూర్చున్న సెరెనా, తన సెల్ ఫోన్ ను మరో కుర్చీలో పెట్టింది. ఇది గమనించిన ఓ దొంగ మెల్లిగా వచ్చి ఆమె పక్కన నిల్చున్నాడు.
నెమ్మదిగా ఆ ఫోన్ తీసుకుని పరుగు లంఘించుకున్నాడు. అయితే సెకన్ల వ్యవధిలో స్పందించిన సెరెనా కూర్చున్న కుర్చీలోంచే దూకింది. కళ్లు మూసి తెరిచేలోగా శివంగిలా దొంగ ముందు నిలబడింది. ఊహించని ఈ పరిణామానికి షాక్ తిన్న దొంగగారు సెల్ ఫోన్ ను సెరీనా చేతిలో పెట్టి అక్కడి నుంచి తుర్రుమన్నాడు. తిరిగి రెస్టారెంట్ కు వచ్చిన సెరెనాకు అక్కడ కూర్చున్న వారంతా లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు. ఇక ఈ ఘటనను కళ్లకు కట్టేలా రాసి తన ‘ఇన్ స్టాగ్రాం’, ‘ఫేస్ బుక్’లలో పోస్ట్ చేసింది సెరీనా.