ఉత్తరాఫ్రికాలోని ట్యునీషియా రాజధాని టునిస్ లో బాంబు పేలుళ్లు జరిగి, 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి ఆ దేశ అధ్యక్షుడే లక్ష్యంగా జరిగినట్లుగా సమాచారం అందుతోంది. అధ్యక్షుడు భద్రత సిబ్బందితోసహా ప్రయాణిస్తున్న బస్సుని దుండగులు పేల్చేశారు. ఈ ఘటనలో 12 మంది చనిపోగా, 30 మంది వరకు గాయపడ్డారని తెలుస్తోంది. అయితే ఈ దాడి ఎవరు చేశారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. గత జూన్ నెలలో ఐఎస్ ఉగ్రవాదులు ట్యునీషియాలో దాడులు జరిపారు. అప్పుడు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పుడు కూడా అనుమానాలు వారిపైనే వ్యక్తమవుతున్నాయి.
రాజధాని నగరం నడిబొడ్డులో జరిగిన పేలుడుతో ఉలిక్కిపడ్డ ట్యునీషియా ప్రభుత్వం.. ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించింది. నెలరోజుల పాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు అధ్యక్షుడు బెంజీ ఖాయిద్ ఎసెబ్సీ వెల్లడించారు. కాగా, దాడికి పాల్పడింది ఉగ్రవాదులే అయిఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ దాడి లక్ష్యం అధ్యక్షుడే అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రదాడుల నేపథ్యంలో ఫ్రాన్స్ తర్వాత అత్యయిక పరిస్థితి ప్రకటించిన దేశం ట్యునీషియానే కావటం విశేషం.