మిగతా సామాజిక మాధ్యమాలు విశేషమైన ఆదరణ పొందుతున్న వేళ ట్విట్టర్ కి క్రమంగా ఆదరణ తగ్గుతూ వస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్ తర్వాత వచ్చిన వాట్స్ యాప్, ఇన్ స్టాగ్రాంలకు వంటి వాటికి ఆదరణ పెరుగుతుండగా ట్విట్టర్ ఖాతాదారులు తగ్గడం ఆ సంస్థను ఆలోచనలో పడేస్తోంది. ముఖ్యంగా కంపెనీ సీఈవో మారినప్పటి నుంచి ట్విట్టర్ పిట్ట కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఫేస్ బుక్ తరహాలో ఆల్గారిధమిక్ టైమ్ లైన్ ను ప్రారంభించేందుకు ట్విట్టర్ సన్నాహాలు చేస్తోంది. గతంలో కేవలం పరిమిత పదాలతో ట్వీట్ చేసే వీలున్న ట్విట్టర్ తాజాగా ఆ పదాల సంఖ్యను పెంచింది.
వినూత్నమైన ఫీచర్లతో ప్రజాదరణ చూరగొనేలా చేసేందుకు ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. కాగా, 2015 చివరి నాటికి ఫేస్ బుక్ కు 160 కోట్ల మంది ఖాతాదారులుండగా, ఇన్ స్టాగ్రాం ఖాతాదారుల సంఖ్య 40 కోట్లు. ట్విట్టర్ కు 30.50 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. దీంతో ఎలాగైనా ఫాలోవర్ల సంఖ్యను పెంచేందుకు ట్విట్టర్ ప్రయత్నాలు ప్రారంభించింది.