సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు రేపే దుమారం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బహిరంగంగా వారు చెసే ప్రకటనకన్నా ఇలా సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలే వివాదాలకు దారితీస్తున్నాయి. బూతు కామెంట్లు, ఫోటోలు, మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇలా ఎన్నో. అయితే ఇలాంటి పనులు ఇకపై చెల్లబోవు అంటోంది సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్. నెటిజన్లు చేసే ట్వీట్లలో అభ్యంతరకర పదాలు ఉండరాదని ట్విట్టర్ పేర్కొంది. ఈ మేరకు తన రూల్స్ మారుస్తున్నట్టు ప్రకటించింది.
ఎవరినైనా వేధించేలా, కించపరిచేలా ట్వీట్లు చేస్తే, వాటిని అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు 'అబ్యూజ్ అండ్ స్పామ్' సెక్షన్ ప్రారంభించామని, ఇందులో భాగంగా ద్వేషపూరిత వ్యాఖ్యలకు చెక్ చెప్పనున్నామని వెల్లడించింది. "హింస పెరిగేలా మీరు వ్యాఖ్యలు చేయరాదు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మరో వ్యక్తి మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు, జాతి వివక్ష, లింగ వివక్ష, మతపరమైన వ్యాఖ్యలు, వ్యక్తికున్న రుగ్మతలు, వికలాంగత్వాన్ని సూచించే వ్యాఖ్యల ప్రస్తావన ఇకపై ట్వీట్లలో ఉండరాదు" అని ట్విట్టర్ పేర్కొంది. అంతేకాదు సూసైడ్ చేసుకుంటామని పోస్టులు చేయటం, ఉగ్రవాదం పేరిట ఏ తరహా వ్యాఖ్యలూ ఉండరాదని కూడా ట్విట్టర్ పేర్కొంది. ఎవరైనా కొత్త నిబంధనలను మీరితే, వారి ఖాతాలను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. కొత్త రూల్స్ పై కస్టమర్లకు అవగాహన కల్పిస్తున్నామని ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డిక్ కాస్టోలో వెల్లడించారు.