నెత్తుటి జ్ఞాపకాలను చెరుపుకొని పెషావర్ లోని ఆర్మీ పాఠశాల సోమవారం నుంచి తిరిగి ప్రారంభమైంది. గత నెల 16న పాక్ తాలిబన్ ఉగ్రవాదులు పాఠశాలలోకి చోరబడి చిన్న పిల్లలని చూడకుండా మరీ కర్కశంగా కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 132 మంది చిన్నారులు సహా మొత్తం 140 మంది అసువులు బాశారు. ఈ దాడి అనంతరం ఈ పాఠశాలతోపాటు పాక్ లోని మరికొన్ని పాఠశాలలు కొన్నిరోజులపాటు మూతపడ్డాయి. అయితే చేదు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కూర్చుంటే ఎలా? తిరిగి విద్యాబోధన ప్రారంభించాల్సిందే కదా. ఈ క్రమంలో అధికారులు ధ్వంసమైన పాఠశాలకు తిరిగి మరమత్తులు చేయించారు. సోమవారం ఉదయం విద్యార్థులకు పాఠాలు బోధించటం ప్రారంభించారు. పిల్లలు మాత్రం ఆ ఘోర కలిని తల్చుకుని ఇంకా భయపడుతూనే ఉన్నారు.