బ్రదరూ... నీరు కన్నా బీరే బెటరు

December 06, 2014 | 03:57 PM | 56 Views
ప్రింట్ కామెంట్

మనదేశంలో తాగునీటి పరిస్థితి గమనిస్తే, ఒక్కోసారి ఆ నీరు తాగకుండా ఉండడమే మేలనిపిస్తుంది! గ్రామీణ వాసులే కాదు, పట్టణ ప్రాంత ప్రజలు కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చుతారు. మలినాలతో కూడిన నీటిని తాగి అనారోగ్యం పాలవ్వాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి? ఇటీవల వెలువడిన ఓ అధ్యయన ఫలితాలను చూస్తే, అలాంటి నీటి కంటే బీరు బెటర్ అనిపించకమానదు. బీరు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఇప్పటివరకు ఎన్నో అధ్యయనాలు ఘోషించాయి. తాజా అధ్యయనం మాత్రం బీరుతో ఎన్ని లాభాలున్నాయో వివరించింది. బీరు సేవించేవాళ్లు దీర్ఘకాలం జీవిస్తారట. మితిమీరి తాగితే అది వేరే విషయం. బాగా తాగేవారిలో ఐసోఫేగల్ క్యాన్సర్, లివర్ సిరోసిస్ తదితర సమస్యలు చుట్టుముడతాయి. కానీ, పరిమితంగా బీరు తాగితే, అది ఆరోగ్యదాయకమని పరిశోధకులంటున్నారు. ఆరెంజ్ జ్యూస్, పాలు ఎలా సహజసిద్ధ ఆహార పదార్థాలో, బీరు కూడా అంతేనట. ఓ బ్రెడ్డు తయారీలో ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారో, బీరును కూడా అలానే తయారుచేస్తారు. దీంట్లో కేలరీల సంఖ్య తక్కువ. 12 ఔన్సుల పాలలో ఎన్ని కేలరీలు ఉంటాయో 12 ఔన్సుల బీరు కూడా అన్నే కేలరీలను కలిగి ఉంటుంది. అంటే సుమారు 125 కేలరీలన్నమాట. అదే పరిమాణంలో ఉన్న ఆరెంజ్ జ్యూస్ 150 కేలరీలను కలిగి ఉంటుంది. ఇక, 12 ఔన్సుల బీరులో సగటున 12 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పైగా మంచి కొలెస్ట్రాల్ ను మెరుగుపరుస్తుంది. మంచి కొలెస్ట్రాల్ గా పిలుచుకునే హెచ్ డీఎల్, చెడు కొలెస్ట్రాల్ గా పిలుచుకునే ఎల్ డీఎల్ మధ్య సరైన నిష్పత్తి ఉండేలా తోడ్పడుతుంది బీరు. దీంట్లో బి విటమిన్ పుష్కలంగా లభ్యమవుతుంది. శరీర పోషణకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ కూడా సమృద్ధిగా ఉంటుంది. బీరు తాగడం ద్వారా సూక్ష్మ పోషక పదార్థాలైన మెగ్నీషియం, పొటాషియం శరీరానికి అందుతాయి. ముఖ్యంగా, క్యాన్సర్, హార్ట్ ఎటాక్ ముప్పును బీరు గణనీయంగా తగ్గిస్తుందట. వైన్ తో పోల్చితే బీరులోనే యాంటీ ఆక్సిడెంట్లు అధికమని పరిశోధకులు అంటున్నారు. బీరుతో జీవక్రియలు సాఫీగా సాగుతాయని వివరించారు. చివరిగా, బీరు తాగేవాళ్లు బరువు పెరుగుతారన్నది అపోహ మాత్రమేనని, క్రమం తప్పకుండా బీరు సేవించే వారు, నాన్ డ్రింకర్ల కంటే తక్కువ బరువుంటారని అధ్యయనం చెబుతోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ