అమెరికాలో లో విక్రమ్ యోగా సెంటర్ పేరిట అతిపెద్ద యోగా సామ్రాజ్యాన్ని విస్తరించిన విక్రమ్ చౌధురి చిక్కుల్లో పడ్డారు. తన వద్ద పనిచేసిన జాఫా బోడెన్ అనే మహిళా న్యాయవాదిని వేధించాడన్న ఆరోపణలు నిజమని రుజువు కావడంతో యూఎస్ కోర్టు 6.47 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 43 కోట్లు) భారీ జరిమానాగా చెల్లించాలని తీర్పిచ్చింది.
యోగా సెంటర్ లో ఇతర మహిళలను లైంగిక అవసరాలను తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటున్న విషయాన్ని తాను బహిర్గతం చేసిన తరువాత, తనను ఎంతో ఇబ్బంది పెట్టారని బోడెన్ ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన న్యాయస్థానం ఈ తీర్పివ్వగా, దీనిపై వ్యాఖ్యానించేందుకు విక్రమ్, ఆయన తరఫు న్యాయవాదులు నిరాకరించారు. కాగా, నిన్న చౌధురి మాట్లాడుతూ, ఈ యోగా సెంటర్ ద్వారా తాను సంపాదించింది చిన్న మొత్తమేనని, తానిప్పుడు దివాలా తీయడానికి అతి దగ్గరగా ఉన్నానని వ్యాఖ్యానించాడు.