ఆడవాళ్లు అబలలు కారు సబలేనని కొన్ని సందర్భాలలో అంటుంటారు. అంతేకాదు వారిని నేరుగా యుద్ధరంగంలోకి కూడా ఈ మధ్య దించేశారు. కానీ, వాళ్లు మానవ బాంబులుగా మారటంలో ఆరితేరారని తెలిస్తే మాత్రం మీరు ఖచ్ఛితంగా షాక్ కి గురవుతారు. వరుస హత్యలతో దారుణ మారణకాండకు పాల్పడుతున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు సిరియాలో మహిళలకు ఏకే 47 తుపాకులు ఇచ్చి... పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తున్నారు. దీనికి సంబంధించిన 5 నిమిషాల నిడివి గల వీడియో శనివారం అంతర్జాలంలో విడుదలైంది. వీడియోలో శిక్షణలో పాల్గొన్న మహిళలంతా బురఖాలు ధరించి... అల్లాహూ అక్బర్ అని నినాదాలు చేస్తున్నారు. మాతృభూమి కోసం పోరాటం చేస్తాం. అందుకోసం ఆత్మాహుతికి సైతం సిద్ధం అంటున్నారు. తుపాకీతో కాల్చే కళపై శిక్షణ పొందుతున్నాం. అలాగే షరియా చట్టాలు, మత సంబంధమైన విద్యపై పట్టు సాధిస్తున్నామని అరబిక్ భాషలో మహిళలు తెలిపారు. పురుషులకు ఏ మాత్రం తక్కువ కాకుండా మహిళలు సైతం ఈ పోరాటంలో కీలక భూమిక పోషిస్తున్నారని ఐఎస్ఐఎస్ ఈ సందర్భంగా ప్రకటించింది.