ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరార్ అండ్ సిరియా షార్ట్ కట్ లో ఐఎస్ఐఎస్. ఈ పేరు వింటే చాలు కరుడుగట్టిన రాక్షసులే గుర్తోస్తారు. పీకలు కొయ్యటం, కాల్చి చంపటం వగైరా వికృత చేష్టలతో వెన్నులో వణుకు పుట్టించటం వీరి నైజం. ఇలాంటి వారిపట్ల కూడా పాశ్చాత్య దేశాల బాలికలు ఆకర్షితులై ఇరాక్, సిరియా దేశాల బాట పట్టడం తెలిసిందే. ఫిబ్రవరిలో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి బ్రిటన్ ను వీడిన అమీరా అబ్బాసి అనే 16 ఏళ్ల బాలిక ఓ ఐఎస్ జిహదీని వివాహం చేసుకున్నట్లు తెలిసింది. అమీరా లండన్ లో హైస్కూల్ విద్యను అభ్యసిస్తోంది. ఆస్ట్రేలియా జాతీయుడైన అబ్దుల్లా ఎల్మిర్ అనే ఈ జిహాదీకి జింజర్ జిహాదీ అనిపేరు. (అతని జట్టు అల్లం రంగులో ఉండటతో అతనికా పేరు). కాగా, ఈ విషయం తెలుసుకున్న నిఘావర్గాలు ఆమె ఓ జిహాదీని పెళ్లాడినట్లు గుర్తించారు. శనివారం అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగిందట. అంతేకాదు జింజర్ జిహాదీ కూడా తన పెళ్లిని ఇంటర్నెట్ లో నిర్ధారించాడు. రెండేళ్ల క్రితం సిడ్నీలో ఓ మాంసం దుకాణంలో పనిచేసిన అతడు ఐఎస్ కార్యకలపాలకు ఆకర్షితుడై సిరియా వెళ్లి ఐఎస్ లో చేరాడు. అతను ఓ కరుడుగట్టిన మిలిటెంట్ అని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆ బాలిక మాత్రం తన తల్లిదండ్రులకు కనీసం చెప్పుకుండా అతని గురించి పూర్తిగా తెలిసి కూడా వెళ్లిపోయిందట. తనని తిరిగి రావాల్సిందిగా ఆ తల్లిదండ్రులు రోదిస్తున్నారు. అయితే ఆ యువతి మాత్రం అందుకు ససేమిరా అంటోందట. ప్రేమ అంటే ఇంతే కాబోలు...