ఈ మధ్య యువతి, యువకులకు ఇంటర్నెట్ అంటే నిత్యావసరం అయిపోయింది. ప్రోఫెషనల్ గానే కాకుండా పర్సనల్ గా కూడా అది వారి జీవితంలో భాగస్వామ్యం అయిపోయింది. అయితే చాలామందికి ఇఫ్పుడిది ఓ వ్యసనంగా తయారయి బానిసలుగా తయారవుతున్నారు. ఇలాంటి వారిలో కొంతమంది ఆ రుగ్మత నుంచి బయటపడేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీని నుంచి బయటపడేందుకు బుక్స్ చదవటం, గేమ్స్ ఆడటం ఇలా ఏదో ఒక వ్యాపకంపై దృష్టిసారిస్తున్నారు. కానీ, ఇక్కడో చైనా యువకుడు మాత్రం భిన్నంగా ఆలోచించాడు. అసలు చెయ్యి ఉంటేనే కదా నెట్ వాడేది అనుకున్నాడు. అంతే... నరికేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ సంఘటనను చదవండి. చైనాకు చెందిన జియావో వాంగ్ అనే యువకుడికి ఇంటర్నెట్ పిచ్చి ఓ వ్యసనంగా మారిపోయింది. తినటం కూడా మానేసి పొద్దస్తమానం ఇంటర్నెట్ సెంటర్‌లోనే గడుపుతూ వచ్చాడు. ఆ తర్వాత తాను ఏం కోల్పుతున్నాననే విషయాన్ని గ్రహించసాగాడు. ఈ వ్యసనం నుంచి ఎలాగైనా బయటపడాలని నిర్ణయించుకున్నాడు. అంతే ఆ ఆలోచన వచ్చిందే తడవుగా ఇకేమాత్రం ఆలోచన చేయకుండా ఇంట్లోని కత్తితో తన ఎడమ చేతిని నరికేసుకున్నాడు. ఆ తర్వాత కిందపడిన చెయ్యిని ఓ ట్యాక్సీలో వేసుకుని ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు ఏకంగా పది గంటల పాటు శ్రమించి చేతిని మళ్లీ అతికించారు. అయితే అది పనిచేస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేమంటున్నారు వైద్యులు. ఇంటర్నెట్ అవసరాలకు వాడుకోవాలి గానీ, అదే అవసరం కాదు కదా.