ఎల్ చాపో... పూర్తి పేరు జోక్విన్ ఎల్ చాపో గుజ్మాన్... మెక్సికో పోలీసులకు నచ్చని ఒకే ఒక్క పేరు. దాదాపు 10 వేల మంది పోలీసులు ఇతగాడి కోసం కంటి మీద కునుకు లేకుండా వెతుకుతున్నారు. ఇంతకీ ఈ ఎల్ చాపో ఎవరంటే ఓ డ్రగ్ మాఫియాకి కింగ్. ఒక్క మెక్సికో లోనే కాదు... ప్రపంచం నలుమూలలా ఆయన మాదకద్రవ్యాల వ్యాపారం వేళ్లానుకుని ఉంది. కొన్ని రోజుల క్రితం ఇతగాడు మెక్సికోలోనే భారీ భద్రత ఉండే జైలు నుంచి పరారయ్యాడు. దాదాపు 1.5 కిలోమీటర్ల సోరంగం తవ్వి మరీ తప్పించుకు పోయాడట. అందుకే అతను పోలీసులకు మోస్ట్ వాంటెడ్ అయ్యాడు. కానీ, అదే మెక్సికోలోని సినాలోవా లో మాత్రం అతను దేవుడు. ఆపదలో ఉన్న ఎందరినో ఆదుకున్న దేవుడు. ప్రత్యక్షంగా కనిపించకపోయినా, సేమ్ దేవుడిలాగానే ఎందరికో సాయం అందించాడట. అందుకే అతను జైలు లోంచి తప్పించునిపోయిన వేళ పండగలా వేడుకలు చేసుకున్నారు. జనాల్లో అతని క్రేజ్ ఏ రేంజ్ లో ఉందంటే ఆ దేశ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో కంటే ఎల్ చాపో నే వారికి ముఖ్యమట. ‘‘రాజకీయ నాయకుల కంటే ఎల్ చాపో ఎంతో మేలు. మా సంపదను కొల్లగొట్టకుండా ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించాడు. పైగా ఆపదలో ఉన్న ఎన్నో వేల మందిని ఆదుకున్నాడు. అసలు అతన్ని జైలు లో పెట్టిన అవినీతి నేతలకన్నా ఎంతో మేలు. అంతేకాదు అలాంటి వారి చెర నుంచి తప్పించుకున్నాడంటే అతను ఎంతో తెలివైన వాడేకదా’’ అని అక్కడి జనాలు మురిసిపోతు అతడిని తెగ పొగుడుతున్నారు. అంతేకాదు అతనికి విగ్రహాలు కట్టి మరి పూజలు చేస్తున్నారు.