సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కి దెబ్బ మీద దెబ్బలు పడుతనున్నాయి. మొన్నటికి మొన్న భారత్ లో నెట్ వినియోగంపై గుత్తాధిపత్యం సాధించేందుకు ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ ప్రతిపాదించిన ‘ఫ్రీ బేసిక్స్’కు ట్రాయ్ రెడ్ సిగ్నల్ వేసింది. నిన్న తన వినియోగదారుల డేటాను ఏ విధంగా వినియోగించుకుంటున్న విషయాన్ని వెల్లడించేందుకు ససేమిరా అన్న ఆ సంస్థకు జర్మనీ కోర్టు భారీ(1.09 లక్షల డాలర్లు (రూ.74 లక్షలు) జరిమానాను విధించింది. ఇక ఇప్పుడు బ్రెజిల్ లో ఫేస్ బుక్ కు మరో పెద్ద షాకే తగిలింది.
మాదక ద్రవ్యాల కేసులో విచారణకు సహకరించడం లేదని ఆరోపిస్తూ బ్రజిల్ పర్యటనలో ఉన్న సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ ఉపాధ్యక్షుడు డియాగో జార్జ్ జోడెన్ ను అరెస్ట్ చేయడం కలకలం సృష్టిస్తోంది. ఫేస్ బుక్ అనుబంధ వాట్స్ యాప్ మాధ్యమంగా నిందితులు పంపుకున్న సందేశాల వివరాలను అందించాలని విచారణ జరుపుతున్న న్యాయమూర్తి సెర్జీప్ కోరగా, అందుకు డియాగో స్పందించ లేదు. దీంతో వ్యవస్థీకృత నేరాల చట్టం కింద అరెస్ట్ వారెంట్ జారీ కాగా, ఆయన్ను అరెస్ట్ చశారు.
ఇక ఈ ఘటనపై ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ స్పందిస్తూ, "ఇది ఓ విచారకరమైన రోజు. డియాగో అరెస్ట్ నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది" అన్నారు. మరోవైపు నేరాల నియంత్రణకు వాట్స్ యాప్ సహకరించాల్సిందేనని బ్రెజిల్ ప్రభుత్వం ఖరాఖండిగా చెబుతున్నప్పటికీ పెడచెవినపెడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో వరుసగా తగులుతున్న దెబ్బలతోనైనా వ్యవహారశైలి మారుతుందేమో!