కొరియన్ పాప్ సెన్సేషన్ సయ్ 'గంగ్నమ్ స్టైల్' పాటతో 2012లో అంతర్జాతీయ చార్టుల్లో వీరవిహారం చేసింది. ‘యోజా’ అన్న ఒక్క పదం మినహా పాట ఏ మాత్రం అర్థం కాకపోయినా విశ్వవ్యాప్తంగా ఏ రేంజ్ లో ఊపు ఉపిందో అందరికీ తెలిసిందే. విడుదలై రెండు సంవత్సరాలయిన తరువాత కూడా ఇప్పటికీ ఈ పాటకు పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా యూట్యూబ్ లో ఆ వీడియో గరిష్ట వీక్షణ సంఖ్య పరిమితి (మాగ్జిమమ్ వ్యూ లిమిట్స్)ని బ్రేక్ చేసిందట. అంతర్జాతీయ వెబ్ సైట్స్ సమాచారం ప్రకారం, ఈనెల 4 వరకు ఆ పాటను 214,74,83,647 మంది చూశారట. వీడియో షేరింగ్ సైట్ లో ఓ వీడియోను ఈ స్థాయిలో చూడటం విశేషం. డిసెంబర్ 21, 2012 రిలీజైన 'గంగ్నమ్...' పాట వీడియో యుట్యూబ్ లో బిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న తొలి గీతంగా రికార్డులకెక్కింది. అంతేగాక, ఈ పాట పాప్యులారిటీ పరంగా జస్టిన్ బీబర్ 'బేబీ' పాటను ద్వితీయ స్థానానికి నెట్టడం విశేషం.