మీరు పెద్ద తిండిబోతులు... అవునా? కాదా?

October 27, 2015 | 05:55 PM | 4 Views
ప్రింట్ కామెంట్
food_habbits_in_india_niharonline

మనం బతకాలంటే కూడు, గూడు, గుడ్డ తప్పనిసరి. ఇందులో మొదటిది మానవ జీవనానికి ఖచ్ఛితంగా అవసరమైంది తినటం. అయితే ఆ తీసుకునే ఆహారం పోషకాలతో కూడినదై, మితంగా ఉంటే ఎటువంటి సమస్యా ఉండదు. కానీ, అదే మితిమీరితే, స్థూలకాయం వంటి ఎన్నో రుగ్మతలు పట్టి పీడిస్తాయి. మన దైనందిన జీవితంలో చేతులో ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ కనిపించే బకాసరులు ఎదురుపడుతూ ఉంటారు కూడా. ఈ నేపథ్యంలో మీరు కూడా తిండిపోతులు అవునా? కాదా? అన్నది ఎలా తెలుసుకోవాలో ఇది చదవండి.

ఎప్పుడూ తిండి ధ్యాసే: ఇది దారుణమైన లక్షణం. ఆఫీసు, స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్లకముందే ఆరోజు మెనూ గనక మీ మనసులో ఉంటే అదోక లక్షణమే అనుకోవాలి. సాయంత్రం ఇంటికి వెళ్లిన తరువాత ఏం తినాలి? రాత్రికి భోజనం ఎలా ఉండాలి? అన్న ఆలోచన వస్తోందా? రాత్రికి స్నేహితుడు ఇచ్చే పార్టీకి వెళ్లి మందు, విందులో పాల్గొనాలని ఉదయం నుంచే ఆలోచిస్తున్నారా? అక్కడ ఉండే స్నాక్స్ ముందే నోరూరిస్తున్నాయా? రెస్టారెంటుకు వెళితే, మెనూ చూడకముందే ఏం ఆర్డర్ ఇవ్వాలో ముందే నిర్ణయించుకుంటున్నారా? ఇవన్నీ తిండిపోతుల లక్షణాలేనట.
ఇక రోడ్లపై వెరైటీగా ఏది కనిపించినా తినాలని అనిపించినా మీరు పెద్ద తిండిబోతులే. కనిపించిన దాన్ని లాగించేయాలనే మనసు కోరికను తీర్చేందుకు కాళ్లను అటువైపు నడిపించే వారు అప్పటికి కాకపోయినా, భవిష్యత్తులో అయినా తిండిపోతులు అవుతారు.

 బతికేందుకు తినాలి కానీ, తినేందుకే బతకకూడదు: జీవితంలో పాటించాల్సిన ప్రధాన సూత్రాల్లో ఇదొకటి. ఓ సమావేశంలో ఉన్నా, పరీక్షలురాస్తున్నా "తరువాత ఏం తినాలి?" అన్న ఆలోచన మనసులో ఉందంటే, వారు తిండిపోతుల కిందే లెక్క.
మిమ్మల్ని చూస్తే, మీ స్నేహితులు ఆహారాన్ని దాచేస్తున్నారా? మీ స్నేహితుల వద్ద ఉన్న లంచ్ లేదా స్నాక్స్ ను మీరు కంటపడగానే దాస్తున్నట్లయితే, మీరు తిండిపోతులుగా మారుతున్నారనడానికి నిదర్శనం. పక్కవారి ఆహారాన్ని రుచి చూడాలని అనిపించే వారు దాన్ని సాధ్యమైనంత త్వరగా వదిలివేస్తే మంచిది.
 స్నేహితులతో ఆహారాన్ని పంచుకోకుంటే..: మీ వద్ద రుచికరమైన తినుబండారాలు ఉన్న సమయంలో అంతా మీరే తినేయాలని, పక్కవాడికి ఒక్క ముక్క కూడా పెట్టకూడదన్న ఆలోచన మనసులో వస్తుందా?... అది కూడా తిండిపోతుల లక్షణమేనండోయ్!
లావుగా ఉన్నా ఫర్వాలేదనిపిస్తోందా?: మీరు ఇప్పటికే ఉండాల్సిన బరువుకన్నా అధికంగా ఉండి, లావుగా కనిపిస్తున్నానని తెలిసి కూడా ఆహారపు అలవాట్లు మార్చుకునే అవసరం లేదని భావిస్తున్నారా? ఇష్టమైన ఫుడ్ తినేందుకే ఆసక్తి చూపుతుంటే... మీరు 'ఫుడ్డీ' కిందే లెక్క.

ఇది చదివాక కూడా ఇప్పటికిప్పుడు ఏదైనా తినాలని అనిపించిందా? అది కూడా తిండిపోతుల లక్షణమే. తినేయండి, ఫర్వాలేదు. కానీ మితంగానే సుమా! అధికంగా తింటే లావైపోతారు మరి!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ