ఐఎస్ ఉగ్ర రాక్షసుల అరాచకాల గురించి తెలిసిందే. మనుషుల ప్రాణాల్ని గాల్లో కలిపేయటంలో వాళ్లని మించిన రాక్షసులు ఉండరు. పీకలు కోయ్యటం, తలలు నరకడం, సజీవ దహనాలు ఇలా వీరి దాష్టీకాలకు హద్దే ఉండదు. తాజాగా వీరు చేస్తున్న మరో దారుణం బయటపడింది. అంతులేని ఇస్లామిక్ తీవ్రవాదుల దురాగతాలకు ఇది మరో ప్రత్యక్ష తార్కాణం. తాము అపహరించిన బాలికలను, యువతులను లైంగిక బానిసలుగా కొనుక్కుపోవాలని ఉగ్రవాదులు పాంప్లెట్లు పంచుతున్నారు. ఒక్కొక్కరి ధరను నిర్ణయిస్తూ, ముద్రించిన కాగితాలు పంచుతున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి జైనబ్ బంగురా వెల్లడించినట్లు బ్లూమ్ బర్గ్ తెలిపింది. ఒక సంవత్సరం వయసున్న చిన్నారులు అత్యధిక రేటు పలుకుతుండగా, 20 సంవత్సరాలు దాటిన అమ్మాయిల రేటు తక్కువగా ఉందని ఆయన వివరించారు. వీరిని వరుసగా నిలబెట్టి విక్రయాలు జరుపుతున్నారని, ఐదారుగురు ఐఎస్ఐఎస్ ఫైటర్లు కలిసి ఒకరిని కొంటున్నారని తెలిపారు. కొన్నిసార్లు బానిసలను వారి సొంత కుటుంబాలకు అప్పగించేందుకు వేలాది డాలర్లు తీసుకుంటున్న ఘటనలూ చోటు చేసుకుంటున్నాయని ఆమె పేర్కొన్నారు. వీరిని బానిసలుగా కొనుగోలు చేసేందుకు మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన ధనవంతులను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అమ్మాయిల్లో అత్యధికులు యాజిడి వర్గానికి చెందిన వారని, వారి శరీర సౌష్టవం, కళ్ల రంగు, కురుల పొడువు తదితరాలు ధరల నిర్ణయంలో కీలకమని అన్నారు. వీటికి చెక్ పెట్టాల్సిందిగా ఆమె ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ని అభ్యర్ధిస్తుంది.