ఇటీవల కెంజి గోటో అనే ఓ ప్రముఖ జపాన్ జర్నలిస్ట్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ ఇరాక్ (ఐఎస్ఐఎస్) కిరాతకంగా గొంతుకోసి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఆ రాక్షసులు చంపిన వీడియోను ఆన్ లైన్లో పెట్టగా, ఆ ఘోరాన్ని చూసిన జపాన్ ప్రధాని షింజో అబె సైతం కంటతడి పెట్టారు. కాగా, ప్రస్తుతం అతనికి సంబంధించిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ‘‘కళ్లు మూసుకుని సహనం పాటించండి. ఇది దాదాపు ప్రార్థించటం వంటిదే. ద్వేష భావం మనుషులకు సంబంధించింది కాదు. ఏ నిర్ణయమూ దేవుడిదే’’ అంటూ నాలుగేళ్ల క్రితం అతను ఓ ట్వీట్ చేశాడు. ఆగ్రహావేశాల నియంత్రణకు సంబంధించి ధ్యానాన్ని అరబ్ సోదరులే తనకు నేర్పారని అందులో అతను వివరించాడు. కెంజీ గోటో పాత్రికేయుడిగానే కాకుండా ఓ గొప్ప సామాజిక వేత్తగా ప్రజలు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం అతను మన మధ్య లేకపోయినా అతడి ట్వీట్ ద్వారా ఇంకా బతికే ఉన్నాడని జపాన్ వాసులు గర్వంగా చెప్పుకుంటున్నారు. అతని స్మరించుకుంటూ ఇప్పటి వరకు ఈ ట్వీట్ ను 26వేల సార్లు రీట్వీట్ చేశారట.