మనుషులను అపహరిస్తూ వారిని బందీలుగా చేసి... గొంతులను నిర్దయగా కొసి పలు వీడియోల్లో కనిపించి అగ్రరాజ్యానికి నిద్ర లేకుండా చేసిన జిహాదీ జాన్ అలియాస్ ఎమ్వాజీ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. కేవలం వీడియోల్లో కనిపించాలనే కోరికతోనే ఆ రాక్షసుడు గొంతులు కోసేవాడట. యువతను ఆకర్షించేందుకు ఐఎస్ఐఎస్ జిహాదీ జాన్ ను వాడుకుంటోందని మాజీ ఫైటర్ అబూ అయిమాన్ తెలిపాడు. తాను గతంలో ఐఎస్ లో ఉన్నప్పుడు ఓసారి ఎమ్వాజీని కలిశానని, అతను మితభాషి అని, మిగతా వారితో పెద్దగా కలిసేవాడు కాదని వివరించాడు. మనుషులను కిరాతంగా చంపి, దానిని వీడియోల్లో చిత్రీకరించటం తద్వారా పైశాచిక ఆనందం పొందటం జాన్(ఎమ్వాజీ) కి ఎప్పటినుంచో అలవాటని పేర్కొన్నాడు. బ్రిటన్ లోని ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు ఎమ్వాజీని పావుగా వాడుకుంటున్నారని ఆరోపించాడు. కాగా, లండన్ లో 2005లో దాడికి ప్రయత్నించి విఫలమైన బ్రుందంలో ఎమ్వాజీ సభ్యుడని అబ్జర్వర్, గార్డియన్ పత్రికలు కథనాలను ప్రచురించాయి.