ఇరవై ఐదు అడుగుల పోడవు, దాదాపు 600 కేజీల బరువు ఉన్న మొసలి ఎంత భయంకరంగా ఉంటుందో కదండీ... అలాంటిదాన్ని ఓ బక్కపల్చటి మనిషి ఒక్కడే చంపి పడేశాడు. ఇంట్రస్టింగ్ కదా... గర్భవతి అయిన తన భార్యను మింగేసిన ఆ మొసలిని చంపాలని కంకణం కట్టుకున్న ఓ భర్త సాధించిన ప్రతీకారమిది. ఉగాండాలోని క్యోగా సరస్సు తీర ప్రాంతంలోని ఓ తండాలో ముబారక్ బటాంబుజే తన భార్య దిమెత్రియా తో కాపురముండే వాడు. నాలుగు నెలల క్రితం గర్భవతి అయిన దిమెత్రియా మంచినీటి కోసం క్యోగా సరస్సు దగ్గరికి వెళ్లింది. అంతే, అందులో ఉండే ఓ భారీ మొసలి ఆమెను అమాంతం నోట కరుచుకుని లాక్కెళ్లింది. దీంతో ఆమె ఆనవాలు లేకుండా పోయింది. కన్నీరు మున్నీరుగా విలపించిన భర్త ఆ మొసలిపై ప్రతీకారం పెంచుకున్నాడు. కొన్ని రోజుల క్రితం అది సరస్సులో మళ్లీ కనిపించిందన్న సమాచారం తెలుసుకున్న ముబారక్ తన స్నేహితులతో కలిసి దానిని చంపాలని నిర్ణయించుకున్నాడు. కానీ దాని భారీ తత్వం ముందు వాళ్లంతా తేలిపోయారు. దీంతో సమీపంలోని ఓ కమ్మరి దగ్గరి వెళ్లి ప్రత్యేకమైన ఈటెను తయారుచేయించుకున్నాడు. ఒంటరిగా వెళ్లి దాదాపు గంటన్నర దానితో పోరాడి ఆఖరికి దాన్ని మట్టుపెట్టాడు. భార్యను మింగిన మొసలిని చంపి ప్రతీకారం తీర్చుకోవటంతోపాటు ఆ తండాకు ఓ పెద్ద హీరోఅయ్యాడు.