సెల్ఫీలు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. సొంత ఫోటలు తీసుకుని మురిసిపోవడం. వాటిని సాంకేతికి మాధ్యమాలలో అప్ లోడ్ చేసి సరదా తీర్చుకోడం ఈ రోజుల్లో యువతకు పరిపాటి అయ్యింది. అయితే ఈ సరదా కొంత మంది ప్రాణాలను బలిగొని ప్రమాదకారిగా పరిణమించిందన్న ఆరోపణలు సద్దుమణిగాయో లేదో, అప్పుడే ఇందులో మరో కోణం వెలుగు చూస్తోంది. సెల్ఫీ మోజులో తేలియాడుతున్న యువత ప్లాస్టిక్ సర్జరీల బాట పడుతోందట. ప్రస్తుతం ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లాంటివి బాగా విస్తరించాయి. అదే సమయంలో స్మార్ట్ ఫోన్ వాడకదారుల సంఖ్య కూడా శరవేగంగా పెరిగింది. ఇక సొంత ఫొటోల అప్ లోడ్ విషయంలో యువత తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. ఇక అసలు విషయానికొస్తే ముఖారవిందం బాగా లేదనుకుంటున్న యువత సెల్ఫీలు తీసుకోవాలన్న యావతోనే ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ల బాట పడుతున్నారట. గడచిన రెండేళ్ల కాలంలోనే ఇలా తమ వద్దకు వస్తున్న యువత 25 శాతం మేర పెరిగిందని అమెరికన్ ప్లాస్టిక్ సర్జన్లు చెబుతున్నారు. ఐఫోన్ తో క్లినిక్ లకు వస్తున్న సదరు యువతీయువకులు, ఆ ఫోన్లలో తమ సెల్పీలతో పాటు ఫేస్ బుక్ లోని ఇతరుల సెల్ఫీలను చూపుతూ, వారిలాగే తమ మోహాలను కూడా కాస్త సరిదిద్దండంటూ కోరుతున్నారట. దీంతో ప్లాస్టిక్ సర్జన్లు కూడా సదరు యువతకు చిన్నపాటి సర్జరీలు చేసేసి, భారీగానే లాభాలు ఆర్జిస్తున్నారట. మరో పక్క ఇలాంటి పిచ్చి చేష్టలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నారు.