మనుషుల పీకలను కూరగాయలను కోసినట్లుగా కోస్తూ పైశాచిక ఆనందం పొందే ఐఎస్ఐఎస్ ఉగ్ర రాక్షసుల గురించి మనకు తెలిసిందే. ముఖ్యంగా జీహాదీ జాన్ అనే పేరుతో తరచూ విడుదలయ్యే వీడియోల్లో మారణకాండకు అంతుపొంతు లేకుండా ఉండటం మనం చూస్తున్నాం. తాజాగా కొత్త జిహాదీ జాన్ ఉగ్రవాది గురించిన కఠోర వాస్తవం ఒకటి వెలుగులోకి వస్తోంది. బ్రిటన్ కు చెందిన భారతీయుడు సిద్దార్థ ధర్ కొత్త జీహాదీ జాన్ గా అవతరించాడని వార్తలు వస్తున్నాయి. బ్రిటన్ తరఫున గూఢచర్యం చేస్తూ, పట్టుబడ్డారన్న ఆరోపణలతో ఐదుగురి తలలను పదునైన కత్తులతో కోస్తున్న తాజా వీడియో ఒకటి విడుదల కాగా, అందులో ఉగ్రవాదులకు లీడర్ గా కనిపించినది సిద్ధార్థేనని బ్రిటన్ మీడియాలో వార్తలు వచ్చాయి. సిద్దార్థ మతం మార్చుకుని అబూ రుమైసాహ్ గా పేరును మార్చుకున్నాడని, ఇప్పుడతను హై ప్రొఫైల్ ఉగ్రవాదని ప్రత్యేక కథనాలు ప్రచురించాయి.
కాగా, తాజాగా విడుదలైన వీడియోలో ఆరంజ్ రంగు దుస్తులను ధరించిన ఐదుగురు వ్యక్తులు వణికిపోతూ మోకాళ్లపై కూర్చోగా, ముఖానికి ముసుగు ధరించిన ఐదుగురు వెనుక నిలబడ్డారు. మధ్యలో ఉన్న వ్యక్తి (సిద్దార్థ్ అని అంచనా) బ్రిటీష్ యాక్సెంట్ లో డేవిడ్ కామెరూన్ ను హతమారుస్తామని హెచ్చరించాడు. ఆపై అందరి గొంతులనూ కోసి చంపారు. ఇక ఈ వీడియోను పరిశీలించిన అతని చెల్లెలు కోనికా ధర, అది తన అన్న గొంతే అని చెబుతోంది. "నేనిప్పుడు షాక్ లో ఉన్నాను. అది నా అన్నయ్య గొంతు మాదిరిగానే ఉంది. కానీ, నేను చూసిన క్లిప్ చాలా చిన్నది. పూర్తి నిర్థారణకు రాలేకపోతున్నా" అని వ్యాఖ్యానించారు. మరోవైపు అతనితో పరిచయం ఉన్న వారు సైతం అది సిద్దార్థ గొంతేననడంలో అనుమానం లేదని బ్రిటన్ అధికార న్యూస్ చానల్ బీబీసీకి వెల్లడించారు.