ప్రజాగ్రహాం ధాటికి నేపాల్ కకావికలం అయిపోతుంది. పశ్చిమ ప్రాంతంలోని కైలాలీ జిల్లాలో ప్రజ్వరిల్లిన హింస కారణంగా ఇప్పటిదాకా 20 మంది మృతిచెందగా, 100 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో జిల్లా పోలీసు ఉన్నతాధికారితో సహా 17మంది పోలీసులు ఉండటం గమనార్హం. ప్రత్యేక థారుహట్ ప్రావిన్స్ కోసం ఉద్యమం చేస్తున్న నిరసనకారులకి, పోలీసులకి మధ్య జరిగిన గొడవ పెద్దదై ఇంతమంది మరణానికి కారణమైంది. స్థానిక పాలనా విభాగం విధించిన కర్ఫ్యూని ధిక్కరిస్తూ కొంతమంది నిరసనకారులు ఒకేచోట గుమిగూడటంతో గొడవ ప్రారంభమైనట్లు నేపాల్ పోలీసు హెడ్‌క్వార్టర్స్ అధికారులు వివరిస్తున్నారు.
పశ్చిమ నేపాల్‌లో థారుహాట్ కమ్యూనిటి ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న జిల్లాలన్నింటిని కలిపి ప్రత్యేక థారుహాట్ ప్రావిన్స్‌ని ఏర్పాటు చేయాల్సిందిగా అందోళనకారులు చాలారోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా పాలనా విభాగం చేసిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని హింసను అదుపుచేసేందుకు ఆర్మీని పంపించేందుకు జాతీయ భద్రతామండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు హోం మంత్రి బాందేవ్ గౌతమ్ పార్లమెంటుకు తెలిపారు. హింసకు గల కారణాలన్నీ పక్కా ప్రణాళికతో పోలీసులను మభ్యపెట్టేవిగా ఉన్నాయని హోంమంత్రి పార్లమెంటులో వివరించారు. ఒక్కసారిగా నిరసనకారులు గుంపు పోలీసులపైకి దూసుకురావడంతో ఉన్నతాధికారితో సహా పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది. సమాఖ్య వ్యవస్థపై గత రెండువారాలుగా జరుగుతున్న హింస కారణం గా డజన్లకొద్దీ పౌరులు మరణించారు. ఆరు ప్రావిన్స్‌ల నమూనా దేశంలోని పలు రాజకీయ పార్టీలు వాటి భాగస్వామ్యపక్షాలు వ్యతిరేకిస్తుండగా, అధికార నేపాలీ కాంగ్రెస్, కమ్యునిస్టు పక్షాలైని సిపిఎన్-యుఎమ్‌ల్, యుసిపిఎన్-ఎమ్, మాదేశారు జనాధికార్ ఫోరం- లోక్‌తాంత్రిక్‌్‌లు అంగీకరిస్తున్నాయి. కీలకమైన సమాఖ్య వ్యవస్థే వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. హింసను ఎంత అదుపు చేద్దామని ప్రయత్నిస్తే అంత ఉవ్వెత్తున ఎగసిలేస్తుందని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.